Uppada Costal Area: తుపాను వస్తే చాలు అక్కడ సందడే సందడి, ఉప్పాడ తీరంలో బంగారం కోసం పోటీ
AP News | తుపాను వచ్చిందంటే చాలు అక్కడ స్థానికులు అన్వేషణ ప్రారంభిస్తుంటారు. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం దొరుకుతుందన్న ప్రచారం వల్లనే ఇదంతా చేస్తున్నారు.
Uppada Beach, Kakinada | తుపాను వస్తే తీరప్రాంత ప్రజలు వణికిపోతుంటారు. ఈదురుగాలులు.. కెరటాల బీభత్సాలు.. మరోపక్క అధికారులు హెచ్చరికలతో తీరప్రాంతంలో ఉండే ప్రజలు అవసరమైతే తుపాను షెల్టర్లుకు వెళ్లాలని కూడా హెచ్చరికలు జారీ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు తెలసుకోబోయే సముద్ర తీరంలో మాత్రం సందడే సందడిగా మారుతుంది. పైగా ఈ తీరంలో గత కొన్నేళ్లుగా రాకాసి అలల తీవ్రతకు భారీగా తీరప్రాంతం కోతకు గురవుతుండగా ఇళ్లు, గుళ్లు, రోడ్లు అనే తేడాలేకుండా కోతకు గురయ్యి సముద్రగర్భంలో కలిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ సందడి ఎందుకు నెలకొంటుందో ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉప్పాడ సముద్ర తీరంలో సందడి..
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండల పరిధిలోకి వచ్చే ఉప్పాడ సముద్ర తీరంలో తుపాన్లు వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు చాలా మంది సముద్రతీరంలో వెతుకులాడుతూ కనిపిస్తుంటారు. ఇంతకీ సముద్రతీరంలో బంగారు రజను కొట్టుకు వస్తుందని వీరు నమ్ముతుండటంతో ఇక్కడ తీరప్రాంతంలో వచ్చిపోయే అలల మధ్య దువ్వెనలు, ఇసుక నుంచి కనిపించని బంగారు రజను వేరుచేసే వస్తువులతో తెగ అన్వేషిస్తుంటారు. ఇది అలా ఏళ్ల కాలంగా ఉప్పాడ తీరంలో కనిపిస్తూ వస్తోంది. ఎందకంటే ఇక్కడ బంగారం కోసం చేసిన అన్వేషణ చాలామందికి ప్రతిఫలాన్ని ఇచ్చిందని చెబుతున్నారు. కొందరికి ఎంతో కొంత బంగారం లభ్యమవ్వడం కనిపించిందట. లభించిన పుత్తడిని బంగారు అభరణాల దుకాణాల వద్దకు వెళ్లి అమ్మితే తగినంత డబ్బుకూడా వచ్చిందని చెబుతున్నారు. అంతెందుకు ఇప్పుడు వెతుకుతున్న మాలో చాలా మందికి చిన్నచిన్న బంగారు ముక్కలు లభ్యమయ్యాయని అక్కడున్నవారు చెప్పడం విశేషం.
ఇంతకీ ఎక్కడ నుంచి వస్తోందీ బంగారం..
సముద్రంలో తుపాన్లు సంభవించినప్పుడు సముద్ర గర్భంలో ఉండే బంగారు గనులు అలల తాకిడికి రజనుగా మారి ఇలా సముద్రతీరానికి కొట్టుకొస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ముఖ్యంగా ఉప్పాడ సముద్రతీరంలో చాలావరకు మత్స్యకార కుటుంబాలు నివశిస్తుంటాయి.. ఈ బంగారం అన్వేషణ లోకూడా ఈ సామాజికవర్గ కుటుంబాలే ఎక్కువగా ఉండడం గమనార్హం. సముద్రంలో తుపాన్లు సంభవించినప్పడే బంగారు చిన్న చిన్న ముక్కలుగా ఇసుకతో కలిసిపోయిన బంగారు రజను దొరుకుతుందని, ఈ ప్రాంతానికి చెందిన చాలా మందికి దొరకడం వల్లనే పనులన్నీ మానుకుని బంగారం వేటలో నిమగ్నమవుతున్నామని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
పోలీసులు హెచ్చరిస్తున్నా వినరు...
తుపాన్లు సమయంలో సముద్రంలోకి దిగవద్దని, తీరంలో ఉండడం ప్రమాదకరమని పోలీసుల హెచ్చరిస్తున్నా గతంలో బంగారం లభ్యం కావడంతో చాలామంది అవేమీ పట్టకుండా ప్రమాదభరితంగా బంగారం అన్వేషణ కొనసాగిస్తున్నారు. తీరం వెంబడి పదుల సంఖ్యలో ముఖ్యంగా మహిళలు ఇసుకలో పెద్దపెద్ద కళ్లను చేసుకుని మరీ బంగారం కోసం అన్వేషిస్తున్నారు.
చాలా మందికి దొరికిందని చెబుతున్న స్థానికులు..
సముద్రతీరంలో ఇంత కష్టపడి ఊరికినే వెతకం కదా.. బంగారం దొరుకుతుంది కాబట్టే ఇంతలా ప్రయాసపడి వెతుకుతున్నాం. ఇదీ ఇక్కడ బంగారం వెతుకుతున్న వారు చెబుతున్న మాటలు.. ఇక్కడ ఉన్నవారిలోనే చాలా మందికి సరిగ్గా ఇక్కడే బంగారం దొరికింది. ఇసుకతో కలిసిపోయి బంగారం రజను వస్తుంది కాబట్టే ఇంతలా గాలిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు.
కొట్టి పారేస్తున్న మరికొందరు..
ఉప్పాడ తీరంలో బంగారం లభ్యమవుతుందన్న మాటలను ఇదే ప్రాంతానికి చెందిన చాలా మంది కొట్టి పడేస్తున్నారు.. అయితే బంగారం కోసం వెతకడం మాత్రం నిజమేనని.. ఈ ప్రాంతంలో చాలా ఇళ్లు కోతకు గురై సముద్ర గర్భంలో కలిసిపోయాయని, ఈ క్రమంలోనే ఏవైనా సామాన్లు కొట్టుకొస్తుంటాయని వెతుకుతుంటారని, అదేవిధంగా చాలా మంది సముద్ర స్నానాలు చేసేటప్పుడు బంగారు వస్తువులు పడేసుకుంటుంటారని, అవికూడా ఒక్కోసారి దొరుకుతుంటాయని, అంతే కానీ సముద్రంలో బంగారు గనులు నుంచి బంగారం కొట్టుకువస్తుందన్నది వాస్తవం కాదని చెబుతున్నారు. ఇవే పలు సార్లు స్థానికులకు దొరకడంతో ఆనాటి నుంచి ఇలా చేస్తుంటారంటున్నారు.