Chandrababu: ఆ గోతులతో నా నడుం విరిగిపోయింది, నిర్వాసితుల్ని జగన్ ముంచేశారు: చంద్రబాబు
పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలో కొత్తగా ఒక్క కట్టడం కూడా జగన్ మోహన్ రెడ్డి చేపట్టలేదని చంద్రబాబు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చేరింది. ఉమ్మడి జిల్లాలోని నీటి ప్రాజెక్టుల స్థితి, కొత్త ప్రాజెక్టుల పనులపై చంద్రబాబు మంగళవారం (ఆగస్టు 8) పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులను సీఎం జగన్ మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. నాలుగేళ్లలో ఏ ఒక్కరికీ పరిహారం అందించలేదని అన్నారు. పైగా, లబ్ధిదారుల జాబితాలో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పట్టిసీమతో సమానంగా ఎకరానికి రూ.19 లక్షలు పరిహారం ఇస్తానని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని చంద్రబాబు జగన్‌ను నిలదీశారు.
తెలుగుదేశం ప్రభుత్వం హాయాంలో పోలవరం నిర్వాసితులకు కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా చేపట్టామని గుర్తు చేశారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలో కొత్తగా ఒక్క కట్టడం కూడా జగన్ మోహన్ రెడ్డి చేపట్టలేదని విమర్శించారు. ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉండగా, 50 శాతం కూడా కనెక్టివిటీ పనులు చేయలేదని, అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు. విశాఖపట్నం తాగునీటి అవసరాల కోసం ఉద్దేశించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని ప్రణాళిక చేస్తే, దాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టేసిందని చంద్రబాబు తప్పుబట్టారు.
ఇంకా మరో 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తే, పురుషోత్తపట్నం పథకానికి భూములు ఇచ్చిన రైతులను జగన్ మోసం చేశారని అన్నారు. రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నంకు వచ్చే రహదారి కూడా గోతుల మయంగా ఉందని అన్నారు. ఆ గోతులతో తన నడుం విరిగిపోయిందని అన్నారు. చంద్రబాబు రాజమండ్రి నుంచి పురుషోత్తపట్నం చేరుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం తొలి దశ పనులను చంద్రబాబు పరిశీలించారు.
టీడీపీ వచ్చాక పురుషోత్తపట్నం పూర్తి
టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా రైతులకు నష్ట పరిహారం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజమండ్రి నుంచి పురుషోత్తంపట్నం వరకు రోడ్డు కూడా నిర్మాణం చేపడతానని అన్నారు. మోసం చేసే వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపాలని అన్నారు.