Konaseema News: సిద్ధమైన బరులు.. కాలుదువ్వుతోన్న కోళ్లు- అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జోరుగా పందేల బరులు
Sankranti News: సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు కోడిపందేలు జోరుగా సాగించేందుకు పందెం రాయుళ్లు కోడిపందేల బరులను సిద్ధం చేస్తున్నారు. అయితే పోలీసుల హెచ్చరికలు మాత్రం బేఖాతరు అవుతున్నాయి..

Roaster Fighting News: సంప్రదాయం ముసుగులో మూడు రోజుల పాటు జోరుగా కోడిపందేలు, జూదాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు సన్నాహకాలు చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా కోడిపందాల నిర్వాహణకు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో కొబ్బరితోటలు, ఖాళీ ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడ ట్రాక్టర్లుతో చదును పనులు చేయిస్తున్నారు. మరోపక్క కోడిపందాలతోపాటు వాటి చెంతనే గుండాటలు ఆడుకునేందుకు రూ.లక్షల్లో అంతర్గత ఒప్పందాలు జరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే పోలీసులు సంక్రాంతిని సంప్రదాయ పద్దతుల్లో జరుపుకోవాలని, కోడిపందేలు, గుండాటలు ఆడితే ఉక్కుపాదం మోపుతామని ఎప్పటిలానే హెచ్చరికలు ఊదరకొడుతుండగా ప్రజాప్రతినిధుల అండతో పందెం రాయుళ్లు తమపని తాము యథేచ్ఛగా చేసుకుపోతున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రతీ సంక్రాంతి పండుగ మూడు రోజులు ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల పరిధిలో పదుల సంఖ్యలో బరుల్లో పందేలు యథేచ్ఛగా జరుగుతుండగా ఈ ఏటా అదే పద్ధతిలో బరులను సిద్ధం చేశారు పందెం రాయుళ్లు. అమలాపురం నియోజకవర్గ పరిధిలో అల్లవరం, అమలాపురం రూరల్ మండలాల పరిధిలో 30 వరకు బరులు సిద్ధం చేసిన పందేల నిర్వాహకులు అక్కడే గుండాట నిర్వహణ కోసం రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్లరేవు మండలాల పరిధిలో కూడా పదుల సంఖ్యలో బరులు సిద్ధం చేయగా అక్కడా గుండాటలకోసం రూ.లక్షల్లో గుండాటల నిర్వాహకుల నుంచి వసూళ్లు జరిగినట్లు సమాచారం..
Also Read: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక - రూ.6,700 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
ఫ్లెక్సీలు పెట్టి మరీ బరి తెగింపు..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో పలు చోట్ల ఇచ్చట కోడిపందాలు జరుగును అని ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆహ్వానాలు చెబుతుండగా పోలీసులు వాటిని తొలగిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లోని పలు చోట్ల బహిరంగంగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ ఇచ్చట కోడిపందేలు జరుగును అంటూ ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపించింది. దీంతో అక్కడికి పోలీసులు వెళ్లి ఫ్లెక్సీని తొలగించారు. ఇదిలా ఉంటే బరుల వద్దే మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు, వాటితోపాటు బిర్యానీలు, ఇతరాత్ర దుకాణాలు నిర్వహించుకునేందుకు రోజూవారీగా రేటు పెట్టి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరికొన్ని బరుల వద్ద లైటింగ్, సౌండ్ సిస్టంతోపాటు చూసేందుకు వీలుగా బల్లలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కోడిపందేల ఏర్పాట్లు కోసం ప్రత్యేకంగా కూటమి పార్టీలకు చెందిన వారినే కమిటీలుగా నియమిస్తున్నారు. రాజోలు, రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లోనూ అక్కడక్కడా పందేల బరులు సిద్ధం అవుతున్నాయి.. ఇదిలా ఉంటే అల్లవరం మండలం రెల్లుగడ్డలో మాత్రం మా గ్రామంలో పందేలు వద్దంటూ గ్రామ సర్పంచ్ నేతృత్వంలో కొంతమంది పోలీసులకు ఆర్జీ సమర్పించడం చర్చనీయాంశం అయ్యింది..
Also Read: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీ - అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
కలెక్టర్, ఎస్పీ ఆదేశాలు బేఖాతరు..
కోడి పందేలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఎస్పీ కృష్ణారావు సంయుక్తంగా హెచ్చరికలు జారీ చేశారు. కానీ బరులు ఏర్పాట్లులో నిమగ్నమైన పందెం రాయుళ్లు మాత్రం వారి పని వారు చేసుకుపోతున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రెండో ఎస్పీగా వచ్చిన సుధీర్‌కుమార్ రెడ్డి టైమ్‌లో ఒక్క బరిలోనూ కోడికాలు దువ్వని పరిస్థితి కనిపించింది.. కోడితో కనిపిస్తే చాలు లోపలేయమని మౌఖిక ఆదేశాలు నిర్మొహమాటంగా జారీ కావడంతో పందెం రాయుళ్లు పందెం అంటేనే పలాయనం చిత్తగించిన పరిస్థితి కనిపించింది. ఆతరువాత గతేడాది యథాతధంగా జరిగిన పందేలు ఈ ఏడాది కూడా అలాగే జరుగుతాయని పందెం రాయుళ్లు చెప్పుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 785 మందిపై బైండోవర్లు పెట్టామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఎస్పీ కృష్ణారావు హెచ్చరించారు. ఇదిలా ఉంటే జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ నిశాంతి సారథ్యంలో సమావేశం నిర్వహించి కోడిపందేల నిర్వాహణపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

