Weather Updates: బీ అలర్ట్ - మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు, పిడుగులు పడతాయని వాతావరణశాఖ వార్నింగ్
Rains In Telangana: వేసవికాలంలో నమోదయ్యే వర్షాలు కనుక, పిడుగు పాటు అవకాశాలు ఉన్నాయని ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్లు వరకు ఆవరించి ఉంది.
Weather Updates: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Light To Moderate Rain Or Thundershowers)ఉంటాయని, వీటి ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని వాతావరణశాఖ సంచాలకురాలు నాగరత్నం తెలిపారు. వేసవికాలంలో నమోదయ్యే వర్షాలు కనుక, పిడుగు పాటు అవకాశాలు ఉన్నాయని ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్లు వరకు ఆవరించి ఉన్నట్లు తెలిపారు. మరో అల్పపీడన ద్రోణి కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణ, ఏపీలో నిన్న సాయంత్రం కురిసిన వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు దిగొచ్చాయి. ఎండల నుంచి తెలుగు రాష్ట్రాల వారికి ఊరట కలుగుతోంది.
తెలంగాణలో మరో రెండురోజులు వర్షాలు..
తేలికపాటి జల్లులు కురవడంతో హైదరాబాద్ నగరవాసులకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. కొన్ని రోజుల కిందటి వరకు 41 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 36 నుంచి 38 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మరో రెండు రోజులపాటు నగరంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్ష సూచన ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వేసవి వర్షాలు కనుక పిడుగులు పడే అవకాశం అధికంగా ఉంటుందని, ప్రజలు చెట్ల కింద, పాడుబడిన ఇళ్ల కింద తలదాచుకోవడం చేయకూడదని హెచ్చరించారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) April 22, 2022
ఏపీలో ఇక్కడ వర్షాలు.. అక్కడ ఎండలు
ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాలతో పాటు యానాంలలో చలి గాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజులపాటు ఈ ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉమ్మండి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వేసవి తాపానికి ప్రజలు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ బారిన పడుతున్నారు. రాయలసీమ ప్రజలు రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచినీళ్లు తాగాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడతాయి. వేసవి వర్షాల్లో పిడుగుపాటు అవకాశం అధికమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైతులు మాత్రం ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Also Read: Gold-Silver Price: బంగారం కొనే వారికి కాస్త ఊరట! నేడు పసిడి ధర ఇలా - భారీగా తగ్గిన వెండి
Also Read: Hyderabad News : పాత బస్తీలో కరెంట్ బిల్లుల వసూలు ప్రాణ సంకటం : సబ్ ఇంజినీర్ విజయ్ కుమార్