Hyderabad News : పాత బస్తీలో కరెంట్ బిల్లుల వసూలు ప్రాణ సంకటం : సబ్ ఇంజినీర్ విజయ్ కుమార్
Hyderabad News : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లు కట్టమన్నందుకు విధుల్లో ఉన్న సబ్ ఇంజినీర్ పై కొందరు యువకులు దాడి చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. దాడికి గురైన బాధితుడు ఏబీపీ దేశంతో మాట్లాడారు.
Hyderabad News : హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో కార్వాన్ విద్యుత్ కార్యాలయంపై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. విధులు నిర్వహిస్తున్న సబ్ ఇంజినీర్ విజయ్ కుమార్ ను కాళ్లతో ఛాతిపై తన్నుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్న వీడియో దుమారం రేపింది. దాడికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి గురైన బాధితుడు సబ్ ఇంజినీర్ విజయ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్సపొందిన తరువాత మొదటిసారి మీడియా ముందుకొచ్చారు. ABP దేశంతో Exclusiveగా మాట్లాడారు. దాడి జరిగిన రోజు ఏం జరిగింది. ఎందుకు దాడి చేశారు. విద్యుత్ బిల్లులు వసూలు చేయడం అంటే పాతబస్తీలో అధికారులకు ఎందుకు ప్రాణ సంకటంగా మారుతోంది. ఇలా అనేక అంశాలపై సంచలన విషయాలు బయటపెట్టారు.
దాడికి కారణాలేంటి..?
విధినిర్వహణలో భాగంగా కార్వాన్ విద్యుత్ కార్యాలయం పరిధిలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కరెంట్ బిల్లులు వసూలు చేయడానికి వెళ్లామని సబ్ ఇంజినీర్ విజయ్ కుమార్ తెలిపారు. విశాల్ అనే వ్యక్తి పేరుతో ఉన్న విద్యుత్ బిల్లు గత ఇరవై ఆరు నెలలుగా పెండింగ్ లో ఉంది. ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ సరఫరా నిలిపివేసినా బిల్లు కట్టలేదన్నారు. ఆ బిల్లుపై రూ.17,700 చెల్లించాల్సి ఉందని తెలిపారు. "పవర్ కట్ చేస్తే తిరిగి లోకల్ లైన్ మెన్ తో అక్రమంగా సరఫరా పునరుద్దరించుకుంటున్నారు. మీటర్ వద్ద సీల్ తొలిగించి విద్యుత్ చోరికి పాల్పడుతున్నారు. ఇలా స్థానికంగా పదిమందిని గుర్తించి వారికి మెయిన్ లైన్ వద్ద వైర్ కట్ చేసింది. ఇకపై బిల్లు కట్టకుండా విద్యుత్ పొందడం అసాధ్యం అయ్యేలా చేశాం. ఇలా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో నాపై కక్షపెంచుకున్న విశాల్ అతని కుటుంబ సభ్యులు విద్యుత్ కార్యాలయంపై దాడికి దిగారు. బిల్లు అమౌంట్ తగ్గించాలని కోరడంతో అలా సాధ్యంకాదని, 26 నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉందని మొత్తం చెల్సించాల్సిదేనని చెప్పాను. దీంతో అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. ఎంత వారించినా వినకుండా విధినిర్వహణలో ఉన్న నన్ను కాళ్లతో ఛాతిపై తన్నారు. విచక్షణా రహితంగా దాడిచేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు." అని విజయ్ కుమార్ తెలిపారు.
పాతబస్తీలో అంతేనా?
ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లులు వసూలు చేయడం అందులోనూ మొండి బకాయిలను వసూలు చేయడమంటే ప్రాణ సంకటంగా మారిందని విజయ్ కుమార్ తెలిపారు. తనపై దాడి జరిగిన వీడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని విజయ్ కుమార్ అన్నారు. ఇలా వెలుగులోకి రాని దాడులు ఎన్నో జరుగుతూనే ఉంటాయన్నారు. ఓల్డ్ సిటీలో 60 శాతం మంది సక్రమంగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంటే, మిగతా 40 శాతం మాత్రం ఏళ్ల తరబడి విద్యుత్ ఉచితంగా వాడుకుంటున్నారన్నారు. అదేమని అడిగితే నీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారన్నారు. దీంతో బిల్లులు వసూలు చేయాలంటే విద్యుత్ సిబ్బంది హడలిపోయే పరిస్థితి ఓల్డ్ సిటీలో నెలకొందని చెప్పారు. బిల్లులు చెల్లించని వారికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తే, తిరిగి లోకల్ లైన్ మెన్ తో విద్యుత్ అక్రమంగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నోసార్లు విజిలెన్స్ అధికారులు దాడులు చేసినా పరిస్థితిలో మార్పు రావడంలేదన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా ఉచితంగా రావాలని కొందరు అనుకుంటున్నారన్నారు. అలా నలభై శాతం మందికి పైగా విద్యుత్ బిల్లులు కట్టనేకట్టరని వెల్లడించారు.
బెదిరింపులు..రాజీ ప్రయత్నాలు..నెక్ట్స్ ఏంటి..?
'విధినిర్వహణలో ఉన్న నాపై దాడి చేసిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన నాటి నుండి కేసు రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. డబ్బులిస్తాం కేసులొద్దంటూ రాజకీయ నాయకులతో ఫోన్ లు చేయిస్తున్నారు. ఒకవేళ వినకపోతే నీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎవరు ఎంత బెదిరించినా నేను ఈ విషయంలో వెనక్కి తగ్గను. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ అవినీతిపరులు కాదు. నిజాయితీగా ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాం. ఇలా దాడులతో బెదిరిస్తే ఇలా? ఇంటి నుంచి ఉద్యోగానికి వస్తున్నా. తిరిగి ఇంటికి ప్రాణాలతో వెళ్లామో లేదో అనే భయం నిత్యం వెంటాడుతోంది. నేనొక్కడినే కాదు ఓల్డ్ సిటీలో ఏ ప్రభుత్వ ఉద్యోగి పనిచేయాలన్నా ఇలా ప్రాణభయంతో విధులు నిర్వహించాల్సిందే. నాపై దాడి జరిగిన తరువాత సోషల్ మీడియాలో కొందరు ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. నేను ఇక్కడే ఉంటాను. నా ఫోన్ స్విచ్ ఆప్ చేసి ఇచ్చేస్తాను. మీరు నేను ఉండే ప్రాంతంలో, ఆఫీసులో ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. నేను లంచాలు తీసుకున్నానని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్దంగా ఉన్నాను. ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తున్న వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాపైన జరిగిన దాడి ప్రభుత్వ ఉద్యోగులపై జరిగిన దాడి. నా ప్రాణం పోయినా పర్లేదు. సమాజంలో ఇలాంటి ఘటనలపై ఓ మెసేజ్ వెళ్లాలి. ఆ యువకులపై నాకు కోపం లేదు. ఎంతకైనా వెనక్కి తగ్గను. న్యాయం జరిగేవరకూ పోరాడతాను' అని విజయ్ కుమార్ అన్నారు.