India vs South Africa 2nd Test: భారత్‌ను మోకాళ్ల మీద నిలబెడతాం.. రెండో టెస్ట్ ఫలితంపై దక్షిణాఫ్రికా కోచ్ వివాదాస్పద వ్యాఖ్యలు
IND VS SA 2nd Test Latest News: దక్షిణాఫ్రికాదే పైచేయి అని, భారత్ ఓటమి అంచున ఉందని సఫారీల కోచ్ శుక్రీ కోన్రాడ్ అన్నారు. గౌహతి టెస్టులో భారత్‌ను మోకాళ్ల మీదకు తీసుకొస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

India vs South Africa 2nd Test | గౌహతి: కోల్‌కతా టెస్ట్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టులో కూడా విజయం నల్లేరుపై నడక లాంటిదే. రెండో టెస్టులో సఫారీలు విజయం సాధించే దిశగా సాగుతున్నారు. నాల్గవ రోజున, అతిథ్య దక్షిణాఫ్రికా భారత్‌కు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఆట ముగిసే సమయానికి టీమిండియా 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు.
భారత అభిమానులను రెచ్చగొడుతున్న సఫారీల కోచ్
రెండో టెస్టులో చివరి రోజున భారత్ గెలవాలంటే 522 పరుగులు చేయాలి. ఇది దాదాపు అసాధ్యం. అదే సమయంలో దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 8 వికెట్లు తీస్తే సరిపోతుంది. మంగళవారం రోజు ఆట ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ శుక్రీ కోన్రాడ్ ఒక పెద్ద ప్రకటన చేశారు. దానిపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రీ కోన్రాడ్ చేసిన ఈ ప్రకటనతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదు. అతను 1976లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టుతో సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ దివంగత కెప్టెన్ టోనీ గ్రెగ్ చేసిన ప్రసిద్ధ ఇంటర్వ్యూ నుంచి ఒక వాక్యాన్ని దొంగిలిస్తున్నానని చెప్పాడు. అతని టీం ఆ సిరీస్‌ను 0-3తో కోల్పోయింది.
టీమిండియాను మోకాళ్ల మీద నిలబెడతాం..
కోన్రాడ్ నాల్గవ రోజు ఆట ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "భారత జట్టు మైదానంలో ఎక్కువ సమయం గడపాలని మేం కోరుకున్నాము. వారిని మోకాళ్లపైకి తీసుకురావాలని మేం కోరుకున్నాము (నేను వేరొకరి ఈ వాక్యాన్ని దొంగిలిస్తున్నాను). మేము మ్యాచ్‌ను వారికి గెలుపు అసాధ్యం అయ్యేలా చేయాలనుకున్నాం" అని పేర్కొన్నాడు. అంటే తొలి ఇన్నింగ్స్ లో భారత్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయినప్పటికీ భారత జట్టును ఫాలో ఆన్ ఆడించకపోవడానికి ఇదే కారణమని భారత అభిమానులకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
కోన్రాడ్ దీని కోసం 'గ్రోవెల్' అనే పదాన్ని ఉపయోగించి వివాదానికి తెరతీశాడు. 'గ్రోవెల్' అంటే నేలపై పడుకోవడం లేదా పాకడం అని అర్థం. దక్షిణాఫ్రికాకు చెందిన శ్వేత జాతి క్రికెటర్ గ్రెగ్ ఈ పదాన్ని దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష విషయం, కరేబియన్ ఆటగాళ్ల సందర్భంలో ఉపయోగించాడు.
దక్షిణాఫ్రికా బోర్డు ఏం చేయనుంది..
ప్రత్యర్థి జట్టు గురించి అభ్యంతరకరమైన మాటలను ఉపయోగించిన తన నల్లజాతి కోచ్‌తో క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు మాట్లాడిందో లేదో ఇంకా తెలియరాలేదు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని, దీనివల్ల మ్యాచ్ ఫలితంపై ప్రభావం పడుతుందా అని కోన్రాడ్‌ను ప్రశ్నించారు. "కొన్ని అంశాలు ఉన్నాయి. మేము కొత్త బంతిని బాగా ఉపయోగించుకోవాలి అనుకున్నాం. ఉదయం కొత్త, గట్టి బంతి మా బౌలర్లకు లభిస్తుంది. దీనితో పాటు, భారత ఆటగాళ్ళు ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయాలని మేం కోరుకుంటున్నాం. మీరు చాలా సమయం బ్యాటింగ్ చేశారని కొందరు అంటున్నారు. నేను అలా భావించడం లేదు" అని చెప్పారు. కాగా, తొలి టెస్టులో స్వల్ప స్కోరును ఛేదించలేక టీమిండియా చతికిల పడింది. రెండో టెస్టులో కొండంత టార్గెట్ ఛేదించే ఛాన్స్ లేదు.. పరువు దక్కాలంటే కనీసం టెస్ట్ డ్రా చేసుకోవాలి.





















