దూకుడుగా రాజకీయాలు చేసి దారుణంగా దెబ్బతిన్నా: అన్నామలై
ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 లో బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొని మాట్లాడారు. దూకుడు రాజకీయాలతో దెబ్బతిన్నానని ఆ తర్వాత తత్వం బోధపడిందని అన్నారు. అలాగే ఐరన్ మ్యాన్ కాంపిటీషన్స్ లో ఎందుకు పాల్గొన్నాడో వివరించారు. ‘నేను శారీరకంగా దృఢంగా ఉండాలనుకున్నా. సాధారణంగా 30-32 ఏళ్ల వయస్సు వచ్చాక మన ఫిట్నెస్ ట్రాక్ తప్పుతుంది. యువతకు నేనిచ్చే సందేశం ఇదే. మనకు వృత్తిజీవితం ఎంత ముఖ్యమో...ఆరోగ్యం అంతే ముఖ్యం. నేను 2025లో అదే టార్గెట్ పెట్టుకుని కష్టపడ్డాను. నా పాత ఫిట్నెస్ నాకు కావాలని కృషి చేశా. అందుకే వేరే వాళ్లకు మార్గదర్శకంగా ఉండాలనే అత్యంత కష్టమైన ఐరన్ మ్యాన్ పోటీల్లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశా’ అని అన్నామలై చెప్పారు.
అలాగే ‘దూకుడుగా రాజకీయాలు చేసి దారుణంగా దెబ్బతిన్నా. ఒకానొక దశలో నన్ను కూడా తప్పించి బీజేపీ ఓ పార్టీగా తమిళనాడులో ఎదిగిన తీరుపై నేను గర్వపడుతున్నా. రాజకీయాల్లో ఎక్కువ మంది శత్రువులను పెంచుకోకూడదు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో నువ్వు వాళ్లతో కలిసి పనిచేసేలా రాజకీయాలు మారతాయి. మన దేశ రాజకీయాలు నాకు ఇదే నేర్పాయి. ఇక్కడ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.’ అని చెప్పారు.





















