Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Andhra Pradesh News | ఏపీలో రాజకీయాలు హద్దులు మీరుతున్నాయి. ప్రతీది రాజకీయం చేస్తున్నారు. పుష్ప 2 సినిమాను మెగా ఫ్యాన్స్, జన సైనికులు తొక్కేయాలని చూశారని పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరిగింది.
YSRCP Targets Pawan Kalyan With Allu Arjuns Pushpa 2 Movie | రాజకీయాలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆ హద్దులు అన్నిటిని చెరిపేస్తూ ముందు కెళుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ పార్టీలు. 'అల్లు వర్సెస్ మెగా ' అనే వివాదంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గాని ఆ వివాదాన్ని బేస్ చేసుకుని పొలిటికల్ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా 'పుష్ప ' సినిమాని మెగా ఫాన్స్, జనసైనికులు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు నేతలు అల్లు అర్జున్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న వైనం చూసేవాళ్ళకి రోత పుట్టిస్తుంది. పుష్ప 2 సక్సెస్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సినిమాకు అనుమతులు, మద్దతు విషయంలో సహకారం అందించిన పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని వికృత ధోరణులు
స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన విధానాల్ని వ్యతిరేకిస్తూ సూపర్ స్టార్ కృష్ణ కొన్ని సినిమాలను తీసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సమయంలోనూ ఆ సినిమాలను పొలిటికల్ సెటైర్స్ గానే చూసారు తప్ప వేరే రాజకీయ పార్టీ ఏదీ దాన్ని వివాదం చేయాలనో, రాజకీయంగా వాడుకోవాలనో ప్రయత్నించలేదు. పైపెచ్చు వ్యక్తిగత జీవితంలో ఎన్టీఆర్, కృష్ణ సన్నిహితులుగానే మెలిగారు. ఒకరిపై ఒకరు గౌరవం తోనే మెలిగారు.
చిరంజీవి 'ప్రజారాజ్యం' పార్టీ పెడుతున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగానే దర్శకరత్న దాసరి 'మేస్త్రి' అనే సినిమా తీశారు అన్న విమర్శ అప్పట్లో వచ్చింది. కానీ ప్రజారాజ్యం దానిని వివాదం చేసే ప్రయత్నం చేయలేదు. మరో కీలక పార్టీగా ఉన్న టీడీపీ కూడా దానిని వాడుకునే కార్యక్రమం ఏదీ చేయలేదు. ఆ మధ్య బాలకృష్ణ హీరోగా వచ్చిన 'అదినాయకుడు ' 'లెజెండ్ ' సినిమాల్లో డైరెక్టుగానే పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి. వాటి మీద మూడో పార్టీ ఏదీ వివాదం చేసే ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ ఎందుకు? 2024 ఎన్నికలకు ముందు వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా 'బ్రో' లో డైరెక్ట్ గానే పొలిటికల్ కామెంట్స్ ఉన్నాయి. అప్పుడు రెండు పార్టీల నేతల మధ్య కొంత మాటలు యుద్ధం నడిచింది కానీ సంబంధం లేని మూడో పార్టీ ఎంటర్ కాలేదు.
2024 ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయిన పరిస్థితి
ఈసారి ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమిని ముఖ్యంగా జనసేన ను పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడానికి వచ్చే ఏ అవకాశాన్ని రాజకీయ ప్రత్యర్థులు వదులుకోవడం లేదు. తమకు సంబంధమే లేని విషయంలో కూడా పవన్ కళ్యాణ్ నూ, మెగా ఫ్యామిలీనీ టార్గెట్ చేయడానికి అల్లు అర్జున్ ను వాడేసుకుంటున్న వైనం తెలుగు ప్రజలను ముక్కు మీద వేలు వేసుకునేలా చేస్తుంది. ఏకంగా అల్లు అర్జునే మెగా ఫ్యామిలీ లో అందరికంటే పెద్ద స్టార్ అంటూ పొగుడుతూనే కావాలనే పుష్ప 2 సినిమాని తొక్కేసేందుకు మెగా ఫ్యాన్స్ ప్రయత్నిస్తుందంటూ సంబంధం లేని రాజకీయ పార్టీల నేతలు, వాటి సానుభూతిపరులు మీడియాకెక్కి చేస్తున్న ప్రయత్నం చూసేవాళ్ళకి చిరాకు తెప్పిస్తుందనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి సాయి దుర్గ తేజ్ లాంటి వాళ్లు పుష్ప 2 కు ఆల్ ది బెస్ట్ చెబితే 'అల్లు vs మెగా ' వివాదంపై అనుమానాలు క్రియేట్ చేసేలా పోస్ట్లు పెడుతూ.. డిలీట్ చేస్తూ..అయోమయానికి గురి చేసిన నాగబాబు కూడా సినిమాను సినిమాలా చూడాలంటూ పుష్ప 2కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. నిజంగా అలాంటి వివాదం ఉన్నా అది ఆ కుటుంబాలకు సంబంధించిన విషయం. వాళ్ళ ఫ్యాన్స్ కు సంబంధించిన విషయం. అంతిమంగా సినిమా వాళ్ళందరూ ప్రొడ్యూసర్ల మేలు కోరేవాళ్లే. కానీ సంబంధంలేని రాజకీయ పార్టీలు ఇలాంటి వివాదాల్ని ఎగదోస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలు పెట్టడం మానుకుంటే మంచిదనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి.