Balayya Fan Marriage : బాలయ్య బాబు వస్తేనే పెళ్లి చేసుకుంటా, అభిమాన హీరో కోసం నాలుగేళ్లుగా ఎదురుచూపులు!
Balayya Fan Marriage : నందమూరి బాలకృష్ణ వస్తేనే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చొన్నాడో వీరాభిమాని. 2019 నుంచి బాలయ్య రాకకోసం ఎదురుచూస్తున్నాడు.
Balayya Fan Marriage : బాలయ్య బాబుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బాలయ్య కొట్టినా చాలు అనుకునే ఫ్యాన్స్ ఉన్నారంటే అతియోశక్తి కాదు. ఏపీలో ఎక్కడికెళ్లినా ఆయన కు వీరాభిమానులు కనపడతారు. అయితే విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం చింతల అగ్రహారానికి చెందిన పెద్ది నాయుడు వీరందరిలో ఎంతో ప్రత్యేకం. చిన్నప్పటి నుంచీ బాలయ్య బాబు అంటే ప్రాణం పెట్టే పెద్ది నాయుడు.... బాలయ్య సినిమా రిలీజ్ అయితే కుటుంబం అంతా కలిసి చూడడానికి వెళ్లాల్సిందే. అలాంటి పెద్ది నాయుడుకు గౌతమీ ప్రియ అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఇప్పుడు కాదు రెండేళ్ల క్రితం. అయితే అప్పటి నుంచీ బాలయ్య బాబు వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానంటూ భీష్మించుకు కూర్చున్నాడు. మధ్యలో కరోనా రావడం ...బాలయ్య బాబు డేట్స్ దొరకకపోవడంతో ఆ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. చివరికి పెద్ది నాయుడు పట్టుదల తెలిసిన కుటుంబీకులు..బంధువులు ఈ విషయాన్ని విశాఖలో ఉండే బాలయ్య బాబు చిన్న అల్లుడు భరత్ వద్దకు తీసుకెళ్లడంతో అయన ద్వారా విషయం బాలయ్య వద్దకు చేరింది. దానితో కొన్ని డేట్స్ చెప్పి వీటిలో ఒక తేదీకి పెళ్లి ఫిక్స్ చేసుకోమని బాలయ్య నుంచి సూచన రావడంతో..పెద్ది నాయుడు తన పెళ్లిని ఈ నెల 11 అర్ధరాత్రి దాటాక అంటే..ఆదివారం తెల్లారుజామున 2:20 కు ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఈ మధ్యలో నందమూరి కుటుంబంలో తారక రత్న ట్రాజెడీ జరగడంతో బాలయ్య బాబు ఈ పెళ్లికి హాజరవుతారా..లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు చింతల అగ్రహారం గ్రామంలో పెద్ది నాయుడు పెళ్లికి బాలయ్య బాబు హాజరవుతారనే ప్రచారంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
2019లో నిశ్చితార్థం
పెందుర్తి సమీపంలోని చింతల అగ్రహారానికి చెందిన కోమలి పెద్ది నాయుడు కుటుంబమంతా నందమూరి బాలకృష్ణకు వీరభిమానులు. పెద్దినాయుడు చిన్నప్పటీ నుంచి బాలయ్యకు పిచ్చి అభిమాని. బాలయ్య కొత్త సినిమా ఎప్పుడు విడుదలైన సినిమా థియేటర్ల ముందు భారీ కటౌట్లను కట్టి తన అభిమానాన్ని చాటుకునేవాడు. 2019లో పెద్ది నాయుడుకి గౌతమీ ప్రియ అనే అమ్మాయితో వివాహం కుదిరింది. అదే ఏడాది నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ ఏడాదే పెళ్లి కూడా నిర్ణయించారు. తన పెళ్లికి బాలయ్య వస్తేనే పెళ్లి చేసుకుంటానని పెద్ది నాయుడు బంధువులకు చెప్పాడు. బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బాలయ్యకు ఆహ్వానం పంపారు. కానీ బాలయ్య పెళ్లికి రాకపోవడంతో పెద్ది నాయుడు తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. రెండున్నరేళ్లుగా బాలయ్య కోసం ఎదురుచూస్తున్న పెద్ది నాయుడు తాజాగా మరో ముహూర్తం పెట్టుకున్నాడు. ఆ ముహూర్తానికి బాలకృష్ణ వచ్చి వారిని ఆశీర్వదించాలని కోరుతున్నారు.
ఊరు ఊరంతా బాలయ్య రాకకోసం ఎదురుచూపులు
పెళ్లికి బాలకృష్ణ వస్తున్నారన్న ప్రచారంతో ఊరంతా ప్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి. వేపగుంట కూడలి నుంచి చింతల అగ్రహారం పెళ్లి పందిరి వరకు మూడు కిలోమీటర్ల పొడువునా బాలకృష్ణ ఫ్లెక్సీలు కట్టారు అభిమానులు. పెద్ది నాయుడు కోరికకు మద్దతుగా నిలిచిన స్థానికులు, అమ్మాయి తరుపు బంధువులు బాలకృష్ణ రాక కోసం ఏర్పాట్లు చేశారు. బాలకృష్ణ పెళ్లికి రావాలని వధువరూలను ఆశీర్వదించాలని ఊరు ఊరంతా కోరుకుంటున్నారు. స్వాగత బోర్డులు, ఫ్లెక్సీలు కట్టి ఊరు ఊరంతా బాలకృష్ణకు కోసం ఎదురుచూస్తున్నారు. పెళ్లి కొడుకు పెద్ది నాయుడు మాట్లాడుతూ.. నా చిన్నతనం నుంచి బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను. బాలయ్య బాబును స్ఫూర్తిగా తీసుకుని ఆర్థికంగా ఎదిగాను. అందుకే నా పెళ్లి బాలయ్య బాబు ఆశీస్సులతో జరగాలని కోరుకున్నాను. నా కోరికకు బంధువులు, ఊరి ప్రజలకు చెప్పాను. రెండున్నరేళ్లుగా బాలయ్య రాక కోసం వేచి చూసి మార్చి 11న పెళ్లి ముహూర్తాన్ని పెట్టుకున్నానని పెద్ది నాయుడు చెప్పారు. పెళ్లి శుభలేను బాలకృష్ణ అభిమాన సంఘం, బాలకృష్ణ అల్లుడు భరత్‌కు అందజేసి పెళ్లికి బాలయ్య బాబును ముఖ్య అతిథిగా తీసుకురావాలని వేడుకున్నానని తెలిపారు.