AP IPS Transfer: టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ - ఏపీలో సీనియర్ అధికారుల బదిలీలు -పూర్తి డీటైల్స్
IAS officers transfers : ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీటీడీ ఈవో శ్యామలరావు బదిలీ చేశారు. ఆ స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు.

Anil Kumar Singhal as TTD EO: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు. ప్రస్తుతం ఉన్న శ్యామలరావును బదిలీ చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంటీ కృష్ణ బాబును రోడ్స్, ట్రాన్స్ పోర్ట్, బిల్డింగ్ శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సౌరభ్ గౌర్ కు మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. టీటీడీ ఈవో స్థానం నుంచి బదిలీ అయిన శ్యామల రావును సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ప్రవీణ్ కుమార్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. ముకేష్ కుమార్ మీనాను ఎక్సైజ్ శాఖ, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సిఎస్ విజయానంద్ pic.twitter.com/T6SYVroJis
— Manchodu Mani (@manchodumani) September 8, 2025
ఇతర పోస్టింగులు కన్నా టీటీడీ ఈవో పోస్టింగ్ కోసం సీనియర్ అధికారులు చాలా మంది పోటీ పడతారు. చీఫ్ సెక్రటరీ కన్నా.. కొంత మంది అధికారులు టీటీడీ ఈవోగా పని చేయడానికే ఆసక్తి చూపిస్తారు. అనిల్ కుమార్ సింఘాల్ గతంలోనూ టీటీడీ ఈవోగా పని చేశారు. టీడీపీ హయాంలోనే ఆయన ఈవోగా నియమితులయ్యారు. వైఎస్ఆర్‌సీపీ హయాంలోనూ కొంత కాలం ఈవోగా ఉన్నారు. తర్వాత బదిలీ అయ్యారు. ప్రస్తుత ఈవో శ్యామలరావును చంద్రబాబు ప్రత్యేకంగా నియమించారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తిరుమలలో అస్తవ్యస్థ పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు ప్రత్యేకంగా ఈవోగా శ్యామలరావును నియమించారు. అప్పటి నుంచి టీటీడీలో పరిస్థితుల్ని శ్యామలరావు చక్కదిద్దారు. అయితే ఆయనకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు సరిపడలేదన్న ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. శ్యామలరావును జీఏడీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఆయన ప్రాధాన్యాన్ని పెంచినట్లయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అనిల్ కుమార్ సింఘాల్ మొదట 2017 మే 1 నుండి 2020 సెప్టెంబర్ వరకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. 2020లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం హెల్త్, మెడికల్, మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసింది. అయితే, 2022లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎండోమెంట్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులై, టీటీడీ ఎక్స్-ఆఫీసియో సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 డిసెంబర్ 23న, టీటీడీ ఈవో ఎ.వి. ధర్మా రెడ్డి 12 రోజుల సెలవులో ఉన్న సమయంలో, సింఘాల్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ (FAC) ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు.
సింఘాల్ పదవీకాలంలో టీటీడీలో అనేక సంస్కరణలు మరియు యాత్రికుల సౌకర్యాల కోసం చర్యలు తీసుకున్నారు: ఆన్‌లైన్ దర్శనం మరియు సేవ టికెట్ల బుకింగ్ వ్యవస్థను మెరుగుపరిచారు, దీనివల్ల యాత్రికులకు సౌకర్యవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్యూ లైన్‌లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యాలను మెరుగుపరిచారన్న ప్రశంసలు దక్కించుకున్నారు.





















