Sharmila son Raja Reddy Political Entry: కొడుకును రాజకీయాల్లోకి దింపుతున్న YS షర్మిల.. అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్న రాజారెడ్డి
రాజకీయాల్లోకి వైఎస్ షర్మిలా రెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి ప్రవేశిస్తున్నారా.. నేడు కర్నూల్ ఉల్లి మార్కెట్ కు తల్లి షర్మిలతో కలిసి సందర్శనకు బయలుదేరే ముందు ఇంటి వద్ద అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు.

YS Raja Reddy likely to enter Politics | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల (YS Sharmila) తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపుతున్నారు. దాని తాలూకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన షర్మిల తనతోపాటు కుమారుడు రాజారెడ్డిని కూడా తీసుకువెళ్లారు. ఆయనకు ఇదే మొట్టమొదటి రాజకీయ యాత్ర. ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే ముందు అమ్మమ్మ విజయమ్మ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నట్టు షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో తాత రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రాజారెడ్డికి అందించడానికి వైయస్ షర్మిల ఇప్పటినుంచే వ్యూహం రెడీ చేస్తున్నారు.
తాత రాజకీయ వారసత్వమా? కాంగ్రెస్ అధిష్టానం వ్యూహమా?
2024 ఎన్నికలకు ముందు తన అన్న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ పెట్టారు షర్మిల. తర్వాతి పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ లో చేరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆధ్వర్యంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవకపోయినా జగన్ ఓటమిలో తమదైన పాత్ర పోషించామని షర్మిల వర్గం చెబుతోంది. అయితే అదే సమయంలో షర్మిల పోకడతో విభేదించి కొంతమంది కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. మరోవైపు జగన్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ఊహించిన షర్మిలకు ఇంతవరకూ అలాంటి సూచనలు పెద్దగా కనిపించలేదు. దాంతో వైయస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ల రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపాలని ఆమె భావిస్తోంది.

విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న రాజారెడ్డిని ఏపీ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసేలా షర్మిల వర్గం ప్లాన్ చేసినట్టు సమాచారం. తల్లి ద్వారా రెడ్డి, తండ్రి ద్వారా బ్రాహ్మణ లతో పాటు క్రిస్టియన్ వర్గాలను కూడా రాజారెడ్డి ద్వారా పార్టీ వైపు ఆహ్వానించొచ్చని వైయస్ షర్మిల ఆలోచన. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ మేరకు షర్మిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కారణాలు ఏవైనా షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి ఈరోజు (సోమవారం ) అడుగులు పడిపోయినట్టే.
జగన్ కు కుమారులు లేకపోవడాన్ని అవకాశం గా తీసుకుంటున్న షర్మిల?
అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ వారసులుగా కొడుకులకు ఉన్న అవకాశం ఆదరణ కూతుళ్లకు ఉండటం లేదు అన్నది వాస్తవం. అంతలా ఇక్కడ పురుషాదిక్య భావన సమాజంలో పాతుకు పోయిందన్న విశ్లేషణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ దిశగా ఆలోచిస్తే మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కుమారులు లేరు. ఇద్దరూ కుమార్తెలే. దానితో రానున్న రోజుల్లోN వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం తన కుమారుడికే దక్కుతుందని షర్మిల భావిస్తున్నారు. అందుకే ఆ దిశగా కుమారుడు రాజారెడ్డిని సానపెట్టే ప్రయత్నం చేస్తున్నారని. మరి షర్మిల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.





















