Amaravati Quantum Valley: అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh News | అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనిచేయనున్నాయి.

Amaravati Quantum Valley | అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మార్గదర్శకత్వం, సాంకేతిక పర్యవేక్షణ అందించేందుకు రెండు ప్రత్యేక కమిటీలను నియమించింది. ఇవి అపెక్స్ కమిటీ మరియు ఎక్స్‌పర్ట్ కమిటీగా ఉంటాయి. అపెక్స్ కమిటీలో మొత్తం 14 మంది ప్రముఖ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి అధ్యక్షత వహించనున్నారు.
13 మంది నిపుణులతో కూడిన ఎక్స్‌పర్ట్ కమిటీకి తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె సత్యనారాయణ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ రెండు కమిటీలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పని చేయనున్నాయి. అమరావతిలో ఏర్పాటు చేయబోయే క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు ఈ కమిటీలు సమగ్ర మార్గదర్శనం అందించనున్నాయి. అలాగే, సాంకేతిక పరిజ్ఞానం, అమలులో గల సవాళ్లపై పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఈ కమిటీల ఏర్పాటు మరియు బాధ్యతల వివరణకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాటమనేని భాస్కర్ జారీ చేశారు.
అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు చర్యలు
గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. 2026 జనవరి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జూన్ నెలాఖరులో క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీలపై నేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో నీతి ఆయోగ్ సహా వివిధ ఐఐటీల నుంచి ప్రొఫెసర్లు, నిపుణులు, గ్లోబల్ లీడర్లు, ఐబీఎం, టీసీఎస్, అమెరికన్ కాన్సులేట్ ప్రతినిధులు ప్లీనరీ సెషన్లకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు క్వాంటం వ్యాలీ ఏర్పాటులో రాష్ట్ర ప్రాధాన్యతలను వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అమరావతిలో ప్రఖ్యాత ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు క్వాంటం వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఐబీఎం సంస్థ దేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనుంది. రెండు 156 క్యూబిట్ క్వాంటం సిస్టంలను ఐబీఎం (IBM) ఇన్ స్టాల్ చేయనుంది. దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఎల్ అండ్ టీ (L & T) సంస్థ ఏర్పాటు చేస్తుంది. మరో టెక్ సంస్థ టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సేవలతో పాటు హైబ్రీడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ సహకారం అందించనుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో క్వాంటం వ్యాలీ అభివృద్ధి
అమరావతిలో ఏర్పాటు చేయబోయే క్వాంటం వ్యాలీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. దశలవారీగా మొత్తం 90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ఈ క్వాంటం వ్యాలీ అభివృద్ధి కావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా, హైదరాబాదులోని హైటెక్ సిటీ తరహాలో ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యం (PPP Model)తో ఆధునిక బిల్డింగులు నిర్మించనున్నారు. ఈ భవనాలను వివిధ టెక్ సంస్థలకు వాడుకునేందుకు ఇవ్వనున్నారని అధికారులు తెలిపారు.
భవనాల డిజైన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక్క ఉద్యోగికి సగటున 150 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా డిజైన్ చేయనున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రాచలితమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ప్లాన్ ప్రకారం, ప్రభుత్వం అభివృద్ధి చేయబోయే స్థలంలో దాదాపు 60,000 మందికి పని చేసే అవకాశాలు కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులు చర్యలు చేపట్టారు.






















