Nimmagadda Ramesh Kumar: మళ్లీ ఓటుహక్కు కోసం నిమ్మగడ్డ రమేశ్ దరఖాస్తు - దుగ్గిరాలలో ఈసారైనా వస్తుందా?
Nimmagadda Ramesh Kumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ ఓటు హక్కు కోసం మరో సారి దరఖాస్తు చేసుకున్నారు.
Nimmagadda Ramesh Kumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ ఓటు హక్కు కోసం మరో సారి దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం నిమ్మగడ్డ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం దుగ్గిరాలలో నివాసం ఉంటున్నారు. అక్కడ నుంచి ఆయన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంటింటా ఓటు హక్కు తనిఖీల్లో భాగంగా దుగ్గిరాలలో తన ఇంటికి వచ్చిన బూత్ లెవల్ అధికారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు ఫారాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని తన ఓటును 2020లొ అక్కడి ఎన్నికల సంఘం కార్యాలయంలో సరెండర్ చేసినట్లు నిమ్మగడ్డ తెలిపారు. తాజాగా ఏపీలోని తన స్వగ్రామంలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నట్లు చెప్పారు. తాను స్థానికంగా ఉండటం లేదనే సాంకేతిక కారణాన్ని చూపి గతంలో ఓటు హక్కు నిరాకరించారని పేర్కొన్నారు.
దుగ్గిరాలలో ఓటు హక్కు ఇవ్వకుండా నిరాకరించడంపై హైకోర్టుకు వెళ్లినప్పుడు అన్ని ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేయాలని సూచించడంతో తాజాగా దరఖాస్తు సమర్పించానని చెప్పారు. ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు పూర్తి చేసుకున్నాక ఎక్కువ కాలం ఇక్కడే ఉంటున్నట్లు చెప్పారు. ఇక్కడే తాను పుట్టి, చదువుకున్నానని, తన తల్లి కూడా ఇక్కడే ఉంటారన్నారు.
గతంలో దరఖాస్తు తిరస్కరించిన తహసీల్దార్
కొన్నేళ్ల క్రితం నిమ్మగడ్డ హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పని చేసేవారు. ఆ సమయంలో ఆయన గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామంలో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన ఇక్కడ ఉండడంల లేదనే కారణంతో ఆయన దరఖాస్తును తహసీల్దార్ అప్పట్లో తిరస్కరరించారు. దీంతో అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు అప్పీల్ దాఖలు చేశారు.
అక్కడ కూడా కుదరకపోవడంతో రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామానికి చెందిన రమేశ్ కుమార్ హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం ఉంటున్నారని, అక్కడ ఓటర్ల జాబితా లో పేరు నమోదు చేసుకున్నారని, అందుకే ఏపీలో ఓటు ఇవ్వడం కుదరదు అని ఏపీ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది.
దీనిపై రమేస్ కుమార్ వివరణ ఇస్తూ తాను హైదరాబాద్‌లో తన ఓటును రద్దు చేసుకున్నానని, తాజాగా గుంటూరు జిల్లాలో నమోదుకు దరఖాస్తు చేసుకున్నానని విన్నవించుకున్నారు. ఊర్లో తనకు ఇల్లు, పొలం, ఇతర ఆస్తులు ఉన్నాయని.. తాను ఉద్యోగరీత్యా ఎక్కడ ఉన్నా, సొంత గ్రామానికి తరచూ వెళ్లి వస్తుంటానన్నారు. ఏ పౌరుడికైనా దేశంలో ఎక్కడో ఒకచోట ఓటు హక్కు కోరుకునే హక్కు ఉంటుందన్నారు. కావాలనే తన దరఖాస్తు తిరస్కరించారని రమేష్ కుమార్ కోర్టుకు వివరించారు.
ఈ మేరకు వాదనలు విన్న హైకోర్టు రమేష్ కుమార్ కు దుగ్గిరాల లో ఓటు హక్కు కల్పించాల ని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో ఎలక్టోరల్ రిజిస్ర్టేషన్ అధికారి తన దరఖాస్తును అనుసరించి తన పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. దీంతో ఆయనకు ఓటు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ మరోసారి ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు.