Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు
మూగ యువతిని లొంగదీసుకుంటే తమ గురించి ఎవరికీ తెలియని ఆలోచించారు దుర్మార్గులు. కనీసం అరిచే ప్రయత్నం కూడా చేయలేదని, తప్పు జరిగినా తమ గురించి ఎవరికీ చెప్పుకోలేదని వారు భావించారు.
నెల్లూరు జిల్లాలోని కందుకూరులో ఓ యువతిపై సామూహిక అత్యాచారయత్నం చేయడం సంచలనంగా మారింది. కాస్త అమాయకురాలిగా కనిపించే ఆ యువతికి మాటలు రావు. దీన్ని అలుసుగా తీసుకుని ముగ్గురు నీచులు దారుణానికి ఒడిగట్టారు. అమాయకురాలైన ఆమెపై అత్యాచారం చేయబోయారు. అయితే ఆ యువతి వారి చెరనుంచి తప్పించుకుని ఓ పెట్రోల్ బంకులో తలదాచుకుంది. పెట్రోల్ బంక్ సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించారు. వారి చొరవతో ఆ యువతి బయటపడింది. పోలీసులు ఆమెను ఇంటికి చేర్చారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఆటో డ్రైవర్ కాగా, మరో ఇద్దరు స్థానికంగా గూర్ఖాలుగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
కందుకూరు పట్టణంలో ఓ మూగ యువతి కుటుంబంతో సహా నివసిస్తుండేది. చిన్నప్పటినుంచి ఆమెకు మాటలు రావు, చదువులేకపోవడంతో ఇంటి పట్టునే ఉండేది ఆ యువతి. అమాయకురాలు కావడంతో ఆమెపై స్థానికంగా ఉండే ఓ ఆటోడ్రైవర్ కన్నేశాడు. ఆమె ఒంటరిగా బయటకు వచ్చే సమయం చూసుకుని ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అదే సమయంలో ఆటో డ్రైవర్ కి మరో ఇద్దరు గూర్ఖాలు కూడా తోడయ్యారు. ఈశాన్య రాష్ట్రాలనుంచి వచ్చిన ఇద్దరు గూర్ఖాలు కందుకూరు పట్టణంలో కొన్నాళ్లుగా నివసిస్తున్నారు. వారిద్దరితో కలసి ఆటో డ్రైవర్ ఆ మూగ యువతిపై అత్యాచారం చేయబోయాడు. మొదట వారి ప్రవర్తన అనుమానించకపోయినా ఆ తర్వాత వారి దుర్మార్గాన్ని పసిగట్టిన యువతి అక్కడినుంచి తప్పించుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మూగ యువతిని లొంగదీసుకుంటే తమ గురించి ఎవరికీ తెలియదని ఆలోచించారు దుర్మార్గులు. కనీసం అరిచే ప్రయత్నం కూడా చేయలేదని, తప్పు జరిగినా తమ గురించి ఎవరికీ చెప్పుకోలేదని వారు భావించారు. అందుకే అంత ధైర్యంగా రాత్రివేళ ఆమెపై అత్యాచారం చేయబోయారు. అయితే ఆ యువతి వారి చెరనుంచి తప్పించుకుంది. కందుకూరులోని మాచవరం రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్ లోకి వచ్చింది. అక్కడ ఉన్న సిబ్బందికి సైగలతో తన బాధ చెప్పుకుంది. వారు ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. నిందితులచెరనుంచి రక్షించి ఆమె గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పెట్రోల్ బంక్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మూగ యువతి వద్ద వివరాలు సేకరించారు. సైగల ద్వారానే తనపై అత్యాచారం చేయబోయారంటూ ఆమె పోలీసులకు తెలిపింది. వారి వద్ద భోరున ఏడ్చింది. వెంటనే పోలీసులు సీసీ టీవీ ఫుటేజి సాయంతో నిందితుల్ని పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ తో పాటు, గూర్ఖాలుగా పనిచేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చారు. ఈరోజు మధ్యాహ్నం డీఎస్పీ రామచంద్ర, సీఐ వెంకటరావు ఘటనా స్థలానికి చేరుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ముగ్గురు నిందితులపై అత్యచారయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రామచంద్ర తెలిపారు.
పెట్రోల్ బంక్ సిబ్బందికి అభినందనలు..
పెట్రోల్ బంక్ సిబ్బందిని పోలీసులు అభినందించారు. మూగ యువతిని రక్షించి ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు, వెంటనే పోలీసులకు బంకు సిబ్బంది సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను ఇంటికి చేర్చారు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.