Nellore Crime: మూడు నెలల క్రితమే పెళ్లి.. ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్న మహిళా పోలీస్
పెళ్లైన మూడు నెలలకే మహిళా పోలీస్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం అయ్యవారిపల్లి గౌతమ్ నగర్ లో జరిగింది.
సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారామె. తన సచివాలయం పరిధిలో మహిళలకు ఏ ఆపద వచ్చినా ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఆమెది. అవసరం ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి గ్రామంలోని మహిళలకు అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా ఆమెదే. అలాంటి విధుల్లో ఉన్న మహిళా పోలీస్ ఆత్మహత్య చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లైన మూడు నెలలకే ఉరేసుకుని చనిపోయింది. అసలేం జరిగిందంటే..
పెళ్లైన మూడు నెలలకే మహిళా పోలీస్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం అయ్యవారిపల్లి గౌతమ్ నగర్ లో జరిగింది. అయ్యవారి పల్లె గ్రామానికి చెందిన కొండరాజు, రమాదేవి దంపతుల కుమార్తె జ్యోతి శ్రీవిద్య, వయసు 31 సంవత్సరాలు. ఆమె సీతారామపురం బిట్- 2 సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె చెల్లలు సంగీత కూడా అదే సచివాలయంలో సర్వేయర్‌గా పనిచేస్తున్నారు. రోజూ అక్క చెల్లెల్లు ఇద్దరూ ఇంటి నుంచి విధులకు వెళ్లి వస్తుంటారు. ఇద్దరు కుమార్తెలకు సచివాలయం ఉద్యోగాలు వచ్చాయన్న సంతోషంలో తల్లిదండ్రులు ఉన్నారు.
ఈ క్రమంలో శ్రీ విద్యకు మూడు నెలల క్రితమే పెళ్లయింది. భర్త కూడా రెవెన్యూ ఉద్యోగి కావడం విశేషం. వింజమూరు మండలంలోని ఊటుకూరు వీఆర్‌ఏగా పనిచేస్తున్న ప్రకాష్ రావుతో మూడునెలల క్రితం శ్రీవిద్యకు వివాహం చేశారు. అనంతరం శ్రీవిద్య యధావిధిగానే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తోంది. అయితే ఉన్నట్టుండి గురువారం ఆమె విధులకు హాజరై మధ్యాహ్నమే ఇంటికి తిరిగి వచ్చింది. అంతలోనే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కారణం ఏంటి..?
కుటుంబ కలహాల వల్లే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే అందరికీ ధైర్యం చెప్పాల్సిన మహిళా పోలీస్, కుటుంబ సమస్యలపై ధైర్యం చెప్పి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఓ బాధ్యతగల ఉద్యోగి ఇలా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దిశ యాప్ పై మహిళా పోలీసులే ప్రజల్లో అవగాహన కల్పించారు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా దిశ యాప్ లో ఫిర్యాదు చేయాలని కూడా చెప్పారు. మరి తను కష్టాల్లో ఉంటే మహిళా పోలీస్ శ్రీవిద్యకు దిశ యాప్ ఎందుకు గుర్తు రాలేదు. సమస్యలను కుటుంబ సభ్యులతో చర్చించారా..? వారు ఏమన్నారు..? అసలు ఏం జరిగింది అనేది తేలాల్సి ఉంది.
పెళ్లైన మూడు నెలలకే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎప్పుడూ చురుగ్గా చలాకీగా ఉండే శ్రీవిద్య తమ మధ్య లేదని తెలిసే సరికి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. రోజూ తనతోపాటు సచివాలయానికి వచ్చే అక్క ఇకలేదనే విషయాన్ని చెల్లెలు జీర్ణించుకోలేకపోతోంది.
Also Read: Hyderabad: మేనల్లుడ్ని లైంగికంగా వాడుకున్న అత్త.. ఇంకొకరితో ఆ వీడియోలు తీయించి వాటితో..
Also Read : బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి