Nellore Crime: బుల్లెట్టు బండెక్కి వచ్చాడు.. సూసైడ్ లెటర్ రాసి పోయాడు.. ఇంతలోనే మతిపోగొట్టే ట్విస్ట్!
నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం మైపాడు బీచ్ తీరంలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీచ్ వద్ద బైక్, అందులో సూసైడ్ నోట్ స్థానికులకు లభించాయి.
నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం మైపాడు బీచ్ తీరంలో జరిగిన ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మైపాడు బీచ్ లో గత రెండురోజులుగా ఓ బైక్ ఒకేచోట పార్కింగ్ చేసి ఉంది. స్థానిక వ్యాపారులు దీన్ని చూసినా పెద్దగా అనుమానించలేదు. అయితే రోజులు గడుస్తున్నా అటువైపు ఎవరూ రాకపోవడం, బైక్ తీసుకెళ్లకపోవడంతో వారికి అనుమానం వచ్చి ఆరా తీశారు. బైక్ లో సూసైడ్ నోట్ కనపడే సరికి వారు షాకయ్యారు.
సూసైడ్ నోట్ తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అందులో కనిపించింది. దాని ప్రకారం సదరు వ్యక్తి ముత్తుకూరు మండలం పాటూరువారి కండ్రిగకు చెందిన ఉప్పల రమేష్ గా గుర్తించారు. అయితే బండిపై వచ్చిన వ్యక్తి అతనేనా లేదా అతని బండిని ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్లారా అనేది తేలాల్సి ఉంది.
సూసైడ్ నోట్ లో ఏముంది..?
"నన్ను క్షమించండి. నేను రొయ్యల గుంటలు వేసి చాలా అప్పులు అయ్యాను. నేను ఇంకేమీ చెయ్యలేక చచ్చిపోతున్నాను. నేను ఎవ్వరి వల్ల చనిపోవడం లేదు, భాస్కర్ మామ.. నువ్వే అమ్మని, బాబుని చూసుకో. పిల్లలు కూడా జాగ్రత్త. నన్ను క్షమించండి. ఎవరైనా ఈ విషయాన్ని మా వాళ్లకు తెలియజేయండి. ఫోన్, బండి.. వాళ్లకు అప్పగించండి" అంటూ ఆ లెటర్ లో ఉంది.
మనిషి జాడేది..?
ముత్తుకూరులో రమేష్ స్నేహితులు చెప్పిన సమాచారం ప్రకారం అతను అప్పులపాలై ఉన్నాడని తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని అంటున్నారు. అయితే సూసైడ్ లెటర్ రాసి రమేష్ ఎక్కడికైనా వెళ్లిపోయాడా లేక, సముద్రంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ సముద్రంలోకి వెళ్లి ఉంటే కచ్చితంగా డెడ్ బాడీ బయటకు వచ్చి ఉండాలి. మైపాడు తీరంలో కాకపోయినా ఇతర సమీప ప్రాంతాల్లో కూడా రెండురోజులుగా ఎక్కడా శవం సముద్రం నుంచి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో అసలు ఆత్మహత్య ఘటన జరగలేదని పోలీసులు నిర్థారణకు వచ్చారు.
బతికే ఉన్నాడా..?
రమేష్ ఆత్మహత్య వ్యవహారం, సూసైడ్ నోట్ అన్నీ ఫేక్ అని చెబుతున్నారు. అప్పుల బాధలు తాళలేక, అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఇలా సూసైడ్ నోట్ రాసి రమేష్ పారిపోయాడని, కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి క్షేమంగానే ఉన్నానని చెప్పాడని తెలుస్తోంది. అసలు నిజం త్వరలోనే బయటకు వస్తుంది. మొత్తమ్మీద సముద్రం ఒడ్డున బైక్, బైక్ లో సూసైడ్ నోట్.. నెల్లూరు జిల్లాలో కలకలం రేపాయి. చివరకు ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగిన ఎపిసోడ్ అనే విషయం బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Also Read: Nellore Floods: నెల్లూరు జిల్లాలో వాన విచిత్రాలు... పాతాళ గంగ పైపైకి
Also Read: Nellore Rains: దయచేసి నెల్లూరు వైపు రావొద్దు.. వచ్చి ఇబ్బందులు పడొద్దు.. అధికారుల సూచనలు
Also Read: CM Meet Central Team : విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !