Nellore Politics: నీతులు చెప్పడం కాదు, ఆ ముగ్గురితో రాజీనామా చేయించలేదేం!- ఆనం లాజిక్ విన్నారా
Anam Ramanarayana Reddy: 1983లో టీడీపీనుంచి నెల్లూరులో పోటీ చేసి గెలిచానని గుర్తు చేసుకున్న ఆనం, రాజకీయాల నుంచి విరమించుకునే ముందు నెల్లూరు నుంచి పోటీ చేయాలని తాను భావిస్తున్నానని అన్నారు.
Anam Ramanarayana Reddy: సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ చేసిన వ్యాఖ్యలకు ఆనం బదులిచ్చారు. తనని రాజీనామా అడిగే ముందు టీడీపీ నుంచి తీసుకెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అక్రమ సంపాదనకు వారిని అడ్డుపెట్టుకున్నారని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా పోటీ చేస్తానన్నారు ఆనం. తాను రాజకీయ జీవితం ప్రారంభించిన నెల్లూరు సిటీ నుంచి చివరిసారిగా పోటీ చేసి, రాజకీయాలను విరమించాలని ఉంది అని మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు. ఒకవేళ చంద్రబాబు పోటీ వద్దు, జిల్లా గెలుపు బాధ్యత భుజానికెత్తుకోమని చెప్పినా అదే పాటిస్తానని అన్నారు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చారని, దానికి వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోందన్నారు.
నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ఘన స్వాగతం పలికిన ఆనం రామనారాయణ రెడ్డి.. లోకేష్ తో కలసి ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. దీంతో ఆయన దాదాపుగా ఆత్మకూరులో పోటీకి సిద్ధమవుతున్నట్టు తేలిపోయింది. అయితే ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరిలో కూడా ఆయన లోకేష్ యువగళంలో పాల్గొంటున్నారు. తనకు ఏ నియోజకవర్గం అయినా ఒకటేనని, చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఎక్కడినుంచైనా పోటీ చేస్తానన్నారు.
ఇటీవల నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్, ఆనం రామనారాయణ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొంటూ వైసీపీపై విమర్శలు చేస్తున్న ఆనం, ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆనం ఎమ్మెల్యే పదవి జగన్ పెట్టిన భిక్ష అన్నారు అనిల్. ఆయన రాజీనామా చేసి వస్తే ఆయన బలం బయటపడుతుందన్నారు. దీనికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఆనం. తాను వెంకటగిరిలో రాజీనామా చేస్తానని, అనిల్ నెల్లూరు సిటీలో రాజీనామా చేసి వస్తే.. ఆయనకు వారి నాయకుడు తిరిగి టికెట్ ఇస్తే.. ఆ రెండు చోట్ల ఎక్కడినుంచేనా పోటీ చేస్తామన్నారు. అయితే అదే సమయంలో తన రాజీనామా అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ తనవైపు లాక్కుందని, వారితో ఇప్పటి వరకు రాజీనామాలు చేయించకుండానే వైసీపీ ఎమ్మెల్యేలుగా చెలామణి చేయించుకుంటోందని చెప్పారు. ఆ ముగ్గురు రాజీనామాలు చేయకుండా, తనను రాజీనామా అడిగే హక్కు వైసీపీకి లేదని కుండబద్దలు కొట్టారు ఆనం.
రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఉన్నాయని, త్వరలో వైసీపీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. యువ గళం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి కొందరు నేతలకు ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. వేర్వేరు పార్టీల నేతలు విమర్శలు చేసుకోవడం సహజమేనని, అయితే వైసీపీకి చెందిన నేతలు అదే పార్టీకి చెందినవారిని, వారి ఇంట్లోని మహిళలను కించపరిచేలా కామెంట్లు చేయడం తగదన్నారు ఆనం. అది నెల్లూరు రాజకీయ సంస్కృతి కాదన్నారు. నెల్లూరు ప్రజలు తెలివైనవారని, ఎవర్ని ఎక్కడ కట్టడి చేయాలో వారికి బాగా తెలుసన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియచెప్పేందుకు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారని చెప్పారు ఆనం. రాష్ట్రంలో అనైతిక పాలన, దోపిడీ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు.
1983లో టీడీపీనుంచి నెల్లూరులో పోటీ చేసి గెలిచానని గుర్తు చేసుకున్న ఆనం, రాజకీయాల నుంచి విరమించుకునే ముందు నెల్లూరు నుంచి పోటీ చేయాలని తాను భావిస్తున్నానని అన్నారు. తన రాజకీయ జీవితం మొదలైన నెల్లూరులోని ముగింపు కూడా కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. లోకేష్ యువగళం పాదయాత్ర తర్వాత వైసీపీ కొట్టుకుపోక తప్పదన్నారు. ఆ యాత్రకు ప్రజా స్పందన అలా ఉందని చెప్పారు ఆనం. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోందని, ప్రభుత్వమే దీనిని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆనం.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial