MLA Kotamreddy success: అనుకున్నది సాధించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుకున్నది సాధించారు. అధికారుల అలసత్వాన్ని వినూత్న రీతిలో ఎండగట్టిన ఆయన.. ఎట్టకేలకు ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీల నిర్మాణానికి లిఖిత పూర్వక హామీ పొందారు.
![MLA Kotamreddy success: అనుకున్నది సాధించిన కోటంరెడ్డి Mla kotamreddy success in his plan over Nellore bureaucrats DNN MLA Kotamreddy success: అనుకున్నది సాధించిన కోటంరెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/05/5fbf5838a593f01c34b24b61df9a95371657037309_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకున్నది సాధించారు. అధికారుల అలసత్వాన్ని వినూత్న రీతిలో ఎండగట్టిన ఆయన.. ఎట్టకేలకు ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీల నిర్మాణానికి లిఖిత పూర్వక హామీ పొందారు. నిర్ణీత కాల వ్యవధిలో అక్కడ డ్రైనేజీ నిర్మిస్తామని, ప్రజల కష్టాలు తీరుస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఉమ్మారెడ్డిగుంట వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు ఉదయం.. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజి కాలువ సమస్య పరిస్కారం కోసం మురికి గుంటలో దిగారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 21వ డివిజన్, ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని, వందల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారని, రైల్వే అధికారులు, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారని, ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత తమపై ఉందని అందుకే ఈ కాలువలో దిగానని చెప్పారాయన. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ కష్టకాలంలో కూడా రోడ్ల నిర్మాణం కోసం 62 కోట్ల రూపాయలు మంజూరుచేస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో స్థానికంగా రైల్వే అధికారుల మొండి వైఖరి, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని ప్రశ్నిస్తూ మురికి గుంటలో దిగి నిరసన తెలిపారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలనుంచి అధికారులతో మాట్లాడుతున్నా పనులు కాలేదని చెప్పారాయన. అటు రైల్వే అధికారులు, ఇటు కార్పొరేషన్ అధికారులు.. ఒకరిపై ఒకరు చెప్పుకొని ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు కాలువలో దిగానని, అన్నారాయన. అధికారులు హామీ ఇచ్చేవరకు కాల్వలోనుంచి బయటకు రానని భీష్మించుకు కూర్చున్నారు. ప్రజల సమస్యల పరిస్కారం విషయంలో అధికారమా, ప్రతిపక్షమా అని తాను ఆలోచించనని, తానెప్పుడూ ప్రజలపక్షానే ఉంటానన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఎట్టకేలకు రూరల్ ఎమ్మెల్యే పట్టుదలతో అధికారులు దిగొచ్చారు. ఈ నెల 15వ తేదీ లోపల ఉమ్మారెడ్డిగుంటలో డ్రనేజీ కాల్వ నిర్మాణ పనులను పారంభిస్తామని హామీ ఇచ్చారు కార్పొరేషన్ అధికారులు. అటు రైల్వే అధికారులు కూడా బెట్టు వీడారు, మెట్టు దిగారు. 25వతేదీ లోపల కాల్వ నిర్మాణ పనులు చేపడతామని, తమ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు రైల్వే అధికారులు. ఈమేరకు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వారు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. దీంతో ఏళ్లతరబడి అక్కడి సమస్యలతో సతమతం అవుతున్న స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. రూరల్ ఎమ్మెల్యే కృషి వల్లే డ్రైనేజీ కాల్వ నిర్మాణం జరుగుతోందని అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)