Vemireddy resignation from YCP : వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా - త్వరలో టీడీపీలో చేరే అవకాశం !
Vemireddy Prabhakar Reddy : నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నిర్ణయమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరనున్నరు.
Vemireddy Prabhakar Reddy resigned from YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వారు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో పలు చోట్ల అభ్యర్థుల్ని మార్చాలని ఆయన కోరారు. అయితే దానికి సీఎం జగన్ అంగీకరించలేదు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే టిక్కెట్ ఖరారు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని కోరారు. కానీ జగన్ అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. అప్పట్నుంచి వైసీపీకి దూరంగా ఉన్నారు. వైసీపీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు.
జగన్ తీరుతో అసంతృప్తి
నెల్లూరులో వైసీపీ నేతలకు అందుబాటులో లేకుండా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వేమిరెడ్డి తను అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేసి దుబాయ్ వెళ్లిపోయారు. తర్వాత హైదరాబాద్ వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లుగా ప్రచారం జరిగింది. టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని చెప్పుకున్నారు. కానీ అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కూడా ముగియడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి అధికారికంగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో చేరనున్న వేమిరెడ్డి
వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన భార్య కూడా నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరో వైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో లోక్‌సభ అభ్యర్థిగా ప్రత్యామ్నాయాన్ని సీఎం జగన్ రెడీ చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు అయిన అరబిందో శరత్ చంద్రారెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్ గా మారి బెయిల్ తెచ్చుకున్నారు.
నెల్లూరులో వైసీపీ కీలక నేతలంతా పార్టీ మార్పు
నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. కీలక నేతలు టీడీపీలో చేరగా అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట పంపించారు. దీంతో ఇప్పుడు మేకపాటి కుటుంబం, కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు కారణంగా చురుకుగా లేరు. ఆయన కుమరుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మాత్రమే ప్రజల్లో తిరుగుతున్నారు. వైసీపీకి నెల్లూరులో దిగ్గజ నేతలుగా పేరున్న ఆనం, కోటంరెడ్డి వంటి వారంతా టీడీపీలో చేరిపోయారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చేరుతారని తరచూ ప్రచారం జరుగుతోంది.