ఆ నగరం నడిబొడ్డున 15 టన్నుల చెత్త వేశారు.. ఎందుకంటే..?
నెల్లూరు నగరం నడి మధ్యలో చెత్త వేశారు. ఎందుకు అనుకుంటున్నారా? దానికో పెద్ద కారణం ఉంది.
ప్లాస్టిక్ భూతంపై నెల్లూరు జిల్లా యుద్ధం ప్రకటించింది. ముఖ్యంగా నెల్లూరు నగరం నుంచి ప్లాస్టిక్ ని తరిమేయాలని నిర్ణయించారు నేతలు, అధికారులు. దీనిపై అవగాహన కల్పించడంలో భాగంగా ఒకరోజులో చెత్తబుట్టల్లోకి పోయే ప్లాస్టిక్ పదార్థాలన్నిటినీ నగరం నడిబొడ్డున కుప్పగా పోశారు. మొత్తం 15 టన్నుల ప్లాస్టిక్ అది. క్యారీ బ్యాగ్ లు, వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ పదార్థాలు అన్నీ వీటిలో ఉన్నాయి. వీటన్నిటిని నగరం నడిబొడ్డున ఉంచి అవగాహన కల్పించారు. ప్రతి రోజూ నెల్లూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున ప్లాస్టిక్ చెత్తబుట్టల్లోకి వెళ్లిపోతుందని చెప్పారు.
నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం అమలు ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే చాలా సార్లు చాలామంది అధికారులు ప్లాస్టిక్ నిషేధించారు, జరిమానాలు విధించారు. కానీ ఎక్కడా ఏదీ, పూర్తి స్థాయిలో అమలు కాలేదు. గత అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు పగడ్బందీగా నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ముందడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. అక్టోబరు 2వ తేదీ నుంచి 75 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగులపై నిషేధం విధించారు. ప్రజలు ఒక్కసారిగా ఇబ్బందులు పడకుండా.. 15 రోజుల సమయం ఇచ్చారు. వ్యాపారులు కూడా సంచులనే వాడాలని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లలో వస్తువుల్ని ఇస్తే వ్యాపారులపై చర్యలు తీసుకుంటారు.
తిరుపతిలో ఇప్పటికే ఈ యాంటీ ప్లాస్టిక్ ఉద్యమం బాగా ప్రచారంలో ఉంది. అక్కడ దాదాపుగా క్యారీ బ్యాగ్స్ నిషేధించారు. అదే తరహా ప్రయోగం ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు. నెల్లూరు నగరంలో మొత్తం లక్షా 40వేల ఇళ్లు ఉన్నాయి. వీటినుంచి రోజుకి 300 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. ఇందులో 35 టన్నులు ప్లాస్టిక్ పదార్థాలుంటాయి. వీటిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 15 టన్నులుగా ఉంటుంది. వీటి వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. నిత్యం చిన్న చిన్న వస్తువులు, సరకులు మోసేందుకు వినియోగిస్తున్న క్యారీబ్యాగ్ లే మానవ మనుగడకు ముప్పు తెచ్చి పెడుతున్నాయి. వాటిని నివారించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పాకు కమిషనర్ దినేష్ కుమార్. వార్డు సచివాలయాలు, కార్పొరేషన్ సిబ్బందితో 180 బృందాలు ఏర్పాటు చేశామని, వీరి సాయంతో నగరంలోని వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత నెల్లూరులో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లు కనిపించకూడదనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు.
Also Read: CM Jagan: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం.. ఆ విషయంపై అవగాహన కల్పించాలి