CM Jagan: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం.. ఆ విషయంపై అవగాహన కల్పించాలి
బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే లక్ష్యంగా 'స్వేచ్ఛ' కార్యక్రమం ప్రారంభించినట్లు సీఎం జగన్ చెప్పారు. 10 లక్షలమందికి పైగా బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న 10 లక్షల మంది బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను అందించే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు నెలకు 10 చొప్పున న్యాప్‌కిన్లు అందించనున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి పాఠశాలలకు వెళ్లి విద్యార్థినులకు వీటిని ఇవ్వనున్నారు.
రుతుక్రమం సమయంలో స్కూలుకు వెళ్లని పరిస్థితులు తలెత్తుతున్నాయని నివేదికలు చెబుతున్నాయని సీఎం జగన్ చెప్పారు. బాలికలకు ఇలాంటి ఇబ్బందులు రాకూడదనే చాలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నాడు – నేడు కార్యక్రమంలో ప్రతి పాఠశాలల్లో చక్కటి టాయిలెట్లను అందుబాటులోకి తీసుకు వచ్చామని తెలిపారు. రుతు క్రమంలో వస్తున్న ఇబ్బందులపై మాట్లాడుకోవడం అన్నది ఒక తప్పు అనే పరిస్థితి మారాలని సీఎం చెప్పారు. బాలికలకు ఈ పరిస్థితులపై తగినంత అవగాహన, పరిజ్ఞానం కలిగించాలన్నారు.
వయస్సుతో పాటు శరీరంలో వస్తున్న మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు విద్యార్థినులకు అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగానే మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు లకోసారి 7 నుంచి 12వ తరగతి వరకూ చదువుతున్న పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలే కాకుండా, దిశ ఆప్ డౌన్‌లోడ్ , దిశ చట్టం గురించి కూడా అర్థమయ్యేలా చెప్పాలి. మహిళా శిశుసంక్షేమ శాఖ, విద్యాశాఖ, హెల్త్‌డిపార్ట్‌మెంట్ ఈ కార్యక్రమాలను చేపట్టాలి. ప్రతి స్కూల్లోనూ చేపట్టాలి. జేసీలు ఈ కార్యక్రమాలు జరిగేలా పర్యవేక్షణ చేయాలి.
'స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా దాదాపుగా 10 లక్షల మందికిపైగా బాలికలకు నాణ్యమైన బ్రాండెండ్ నాప్‌కిన్స్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ నాప్‌కిన్స్ అందిస్తున్నాం. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్‌కిన్స్‌ను ఉచితంగా అందిస్తాం. సెలవులు ఉంటే.. ముందుగానే అందిస్తాం. స్వేచ్ఛ పథకం అమలు కోసం నోడల్‌అధికారిగా మహిళా అధ్యాపకురాలిని నియమిస్తున్నాం. వినియోగించిన శానిటరీ నాప్‌కిన్స్‌ను పర్యావరణానికి హాని కలగకుండా ఎలా డిస్పోజ్ చేయాలన్న విషయాలమీద కూడా బాలికలకు అవగాహన కల్పిస్తారు.' అని సీఎం జగన్ అన్నారు.
నాప్ కిన్స్ ను సురక్షితంగా డిస్పోజ్ చేసేందుకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకుపైగా ఇన్సునిరేటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందని సీఎం జగన్ అన్నారు. పాఠశాలల్లో కూడా వీటిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామ స్థాయిలో మహిళలకు ఉపయోగపడేలా నాణ్యమైన బ్రాండెండ్ నాప్‌కిన్స్‌ను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకు వస్తున్నామని వెల్లడించారు.