Anandayya : మందు రెడీ .. రెండు రోజుల్లో ఒమిక్రాన్ తగ్గిస్తా..! నెల్లూరు ఆనందయ్య చాలెంజ్ !
రెండు రోజుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను త గ్గిస్తానని నెల్లూరు ఆనందయ్య సవాల్ చేశారు. తన దగ్గర మందు రెడీగా ఉందన్నారు.
నెల్లూరు ఆనందయ్య అంటే ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేనంత పబ్లిసిటీని కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే ఆయన సంపాదించారు. ఆయన మందు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చివరికి ఆయనను పోలీస్ ప్రొటెక్షన్‌లో ఉంచాల్సి వచ్చింది. ఆయన మందు వల్ల నిజంగా కరోనా తగ్గిందా లేదా అన్నదానిపై ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాల్లేవు. నమ్మకం అంతే. కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించిన తర్వాత మెల్లగా ఆయనను కూడా జనాలు మర్చిపోవడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ పేరుతో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. దాంతో ఆనందయ్య మళ్లీ తెర ముందుకు వచ్చారు.
Also Read: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మేడారం జాతరకు వారికి అనుమతి లేదు..! యోచిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంత ప్రభావవంతమైనదో ఇంకా శాస్త్రవేత్తలు తేల్చలేదు.కానీ ఈ వైరస్ అంటుకోవడంలో మాత్రం ఇతర అన్నిరకాలను మించి పోయిందని... మాత్రం గుర్తించారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రభావం చూపిస్తుందనేదానితో సంబంధం లేకుండా... ఆ వైరస్‌ను రెండు అంటే రెండు రోజుల్లో నయం చేసి చూపిస్తానని ఆనందయ్య సవాల్ విసురుతున్నారు. ఈ విషయాన్ని మీడియాను పిలిచి మరీ చెప్పారు.
Also Read: స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ మెల్లగా కేసుల నమోదు ఎక్కువ అవుతోంది. ఈ సమయంలో కొత్త వేరియంట్ కి కూడా తన వద్ద మందు ఉందని ఆనందయ్య ప్రకటించారు. ఒమిక్రాన్ మాత్రమే కాదు మరో 50 రకాల కొత్త వైరస్ లు పుట్టుకొచ్చినా మందులిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం తమకు ప్రభుత్వం, దాతల సహకారం లేదని, ఎవరైనా సహాయం చేస్తే ప్రజలందరికీ మందు ఉచితంగా అందిస్తామని చెబుతున్నారు. తనకు ఆయుష్ విభాగం అనుమతివ్వాలని ఆయన కోరుతున్నారు.
ఆనందయ్య మందుకు శాస్త్రీయత లేకపోవడంతో ప్రభుత్వం కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. నమ్మకంతో ఆయన ఊరికివచ్చే వారికి మందులు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం సహకరిస్తే అందరికీ ఉచితంగా ఇస్తానంటున్నారు. ఇటీవల ఆనందయ్య రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. అంత కంటే ముందుగా ఒమిక్రాన్ కలకలం రేపుతూండటంతో.. ఈ మందు తయారీలో బిజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి