(Source: ECI/ABP News/ABP Majha)
Minister Chelluboina Venu Gopal: ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లదు - మంత్రి వేణుగోపాలకృష్ణ
Minister Chelluboina Venu Gopal: టీడీపీ అధినేత చంద్రబాబు తన కేసు వాదించడానికి సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను నియమించుకోవడంపై మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శలు ఎక్కుపెట్టారు.
Minister Chelluboina Venu Gopal: స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తన కేసు వాదించడానికి సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాను నియమించుకోవడంపై మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శలు ఎక్కుపెట్టారు. కాకినాడ జిల్లా సర్పవరంలో ఆయన మాట్లాడుతూ.. వాచీ కూడా లేని చంద్రబాబు గంటకు రూ.లక్షలు ఇచ్చి సిద్ధార్థ లూథ్రా ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పటిష్ఠంగా ఉందని, ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లదన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. దేశంలో చాలా మంది ఆరోపణలు ఎదుర్కొన్నారని, చంద్రబాబు అతీతుడు కాదన్నారు. విచారణకు సహకరించి చంద్రబాబు తన నిజాయితీ, సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. నేరం చేస్తే చంద్రబాబుకేమైనా వెసులుబాటు ఉంటుందా అని ప్రశ్నించారు.
అంబటి ఆగ్రహం
ఇక చంద్రబాబు అరెస్ట్‌లపై వైసీపీ నేతలు, మంత్రులు వరుసగా విమర్శలు చేస్తున్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఎల్లో మీడియా చంద్రబాబు అరెస్ట్‌ను అక్రమం అని చూపించేందుకు యత్నిస్తున్నాయని అన్నారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం ద్వారా చంద్రబాబు తప్పించుకుంటారనే ప్రచారం ఉందని, అలాంటి రోజులకు కాలం చెల్లిందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత హెలికాప్టర్‌లో తీసుకువెళ్తామని అధికారులు చెబితే అందుకు చంద్రబాబు వద్దన్నారని చెప్పారు. కోట్ల రూపాయలు ఫీజులు తీసుకునే న్యాయవాదులు చంద్రబాబు కన్నా ముందే వచ్చారని ఆరోపించారు.
ఎన్నికల ముందు ఒకరిని అరెస్ట్ చేయాలని మేము ఎందుకు అనుకుంటామన్నారు. చట్టం ప్రకారం శిక్ష పడితే బంద్‌కు పిలుపునిస్తారా? దానికి ఎలా మద్దతు ఇస్తారు? న్యాయస్థానం తీర్పుపై బంద్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇంగితజ్ఞానం లేని వ్యక్తి పవన్ అంటూ అంబటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకున్న పవన్, ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు హాయంలో దాడి చేసినప్పుడు ఏం చేశారంటూ ప్రశ్నించారు. దుర్మార్గపు రాజకీయాలు చేసే చంద్రబాబుకు పవన్ మద్దతు ఇవ్వటం ఏంటని నిలదీశారు. సొంతపార్టీని నాశనం చేసుకుని చంద్రబాబు పల్లకి మోసేందుకు పవన్ సిద్ధమవుతున్నారని, జనసేన కార్యకర్తలు ఆలోచించాలన్నారు.
రోజా ఏమన్నారంటే
చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో వైసీపీ నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి రోజా స్వీట్లు పంచారు. చంద్రబాబుకు ఆరంభం మాత్రమేనని, అంతం కాదని ఆమె అన్నారు. పైనుంచి దేవుడు చూస్తున్నాడని, చంద్రబాబుకు శిక్ష వేస్తాడని అన్నారు. చంద్రబాబు ఎంతో మంది ఉసురు పోసుకున్నాడని, అందరి జీవితాలతో ఆడుకున్నాడని ఆమె అన్నారు. ఇంకా మరిన్ని కేసుల్లో చంద్రబాబు జీవితాంతం జైలులో చిప్ప కూడు తింటాడని రోజా అన్నారు. సరైన సమయంలో దేవుడు చంద్రబాబు పాపాలకు శిక్ష వేశాడని ఆమె అన్నారు.
చంద్రబాబుకు నెంబర్ కేటాయింపు
ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిడంతో ఆయన్ను అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించారు. అర్ధరాత్రి జైలుకు చేరుకున్న చంద్రబాబుకు అధికారులు ప్రత్యేక నెంబర్ కేటాయించారు. ఆయనకు 7691ను ఇచ్చారు. అంతకు ముందు సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆయన్ని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసు విచారణ టైంలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.