LoKesh Today : రోజంతా లోకేష్ టూర్ హైవోల్టేజ్ టెన్షన్ ! చివరికి ట్రాఫిక్ ఉల్లంఘన నోటీసులిచ్చిన పోలీసులు !
టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ నర్సరావుపేట వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రోజంతా ఆయనను చుట్టుముట్టిన పోలీసులు సాయంత్రం ఉండవల్లి ఇంటి వద్ద వదిలి పెట్టారు. ట్రాఫిక్ ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను నర్సరావుపేట వెళ్లకుండా పోలీసులు విజయవంతంగా అడ్డుకున్నారు. ఏడు నెలల కిందట ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కోట అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేష్ నర్సరావుపేట వెళ్లాలనుకున్నారు. దానికి టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే పోలీసులు మాత్రం లోకేష్ నర్సరావుపేట వెళ్లడానికి అనుమతి లేదని ఒక రోజు ముందుగానే ప్రకటించారు. పోలీసు ఉన్నతాధికారుల ప్రకటనకు తగ్గట్లుగానే నారా లోకేష్‌ను పోలీసులు అడుగు పెట్టగానే నిర్బంధించారు.
గన్నవరంలోనే అడ్డుకున్న పోలీసులు
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గర దాదాపుగా వంద నుంచి రెండు వందల మంది పోలీసుల్ని మోహరించారు. విమాన ప్రయాణికులను సెండాఫ్ ఇవ్వడానికి వచ్చే వారిని, రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవారిని కూడా వెళ్లనీయలేదు. చివరికి విజయవాడలో ఓ ప్రైవేట ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన నటుడు సోను సూద్ కోసం నియమించిన ప్రైవేటు సెక్యూరిటీని కూడా అనుమతించలేదు. ఈ గందరగోళం మధ్య లోకేష్ గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగారు. తన కారులో బయటకు వచ్చిన మరుక్షణమే పోలీసులు చుట్టుముట్టారు. బయటకు కదలనీయలేదు.
ఐదు గంటల తర్వాత ట్రాఫిక్ ఉల్లంఘన పేరుతో నోటీసులు
ఎయిర్‌పోర్టు వద్ద రెండు గంటల పాటు నిలిపివేసిన పోలీసులు కారణం ఏమిటో చెప్పలేకపోయారు. తనను ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని లోకేష్ పదే పదే ప్రశ్నించినా పోలీసులు స్పందించలేదు. ఆ తర్వాత మెల్లగా విజయవాడ వైపు వాహనాన్ని తీసుకెళ్లారు. ఓ దశలో లోకేష్‌ను వాహనం నుంచి బయటకు లాగాలాని ప్రయత్నం చేశారు. ఓ పోలీసు అధికారి లోకేష్ చేయి పట్టి లాగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరికి ఐదు గంటల హైడ్రామా తర్వాత పోలీసులు లోకేష్ వాహనాన్ని ఉండవల్లి ఇంటి వైపు తీసుకు వచ్చారు. అక్కడ లోకేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీపీఆర్పీసీ 41 సెక్షన్ కింద అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహిస్తున్నారని, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని నోటీసులో పేర్కొన్నారు. అసలు లోకేష్ రోడ్డు మీదకు రాకుండానే పోలీసులు అడ్డుకున్నా.. ర్యాలీ నిర్వహించినట్లుగా పోలీసులు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
టీడీపీ నేతలంతా హౌస్ అరెస్ట్ - ఎక్కడికక్కడ పోలీసుల దిగ్బంధం
మరో వైపు ఉదయం నుంచి గుంటూరు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలందర్నీ హౌస్ అరెస్ట్ చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో లోకేష్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ నేతల్ని కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నర్సరావుపేటలో కూడా పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. నర్సరావుపేటకు దారి తీసే రోడ్లన్నింటినీ దిగ్భంధించారు.
పోలీసులు అడ్డుకున్నా బాధితుల్ని ఓదారుస్తానన్న లోకేష్
దిశ చట్టం పేరుతో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని పోలీసులు వదిలి పెట్టిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ లోకేష్ మండిపడ్డారు. లేని దిశ చట్టం పేరుతో సొంత మీడియాకు రూ.30 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సీఎం ఇంటి దగ్గరే పెద్ద ఎత్తున మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరన్నారు. మహిళలపై అత్యాచారాలు..దాడులు జరిగితే.. పోలీసులకుఫిర్యాదుచేసే పరిస్థితి కూడా లేదన్నారు. తాను నర్సరావుపేట వెళ్తానంటే ఎందుకు అడ్డుకున్నారని... తాను ఫ్యాక్షనిస్టును కానని.. జగన్ రెడ్డిని అసలే కాదన్నారు. పోలీసులు తనను ఆపలేరని బాధిత కుటుంబాలన్నింటికీ న్యాయం జరిగే వరకూ పోరాడతమన్నారు.
చంద్రబాబు డైరక్షన్‌లో అల్లరి చేస్తున్నారని ప్రభుత్వం విమర్శలు
మరో వైపు లోకేష్ రాజకీయ లాభం కోసం ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. లోకేశ్ ఎలా అల్లరి చేయాలో చంద్రబాబు నాయుడు శిక్షణ ఇస్తున్నారని విమర్శించారు. ఏడు నెలల కిందట జరిగిన సంఘటనలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిదో అందరికీ తెలుసని ... మహిళల భద్రతలో ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని కన్నబాబు స్పష్టం చేశారు. టీడీపీలో కూడా లోకేశ్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని .. కార్యకర్తల మెప్పు కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు.