Dharmavaram Politics: ధర్మవరంలో హైటెన్షన్- కేతిరెడ్డి అరెస్టుకు బీజేపీ నేతల డిమాండ్
కేతిరెడ్డి సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలను చంపాలని చూశారన్నారు సూర్యనారాయణ. ఎమ్మెల్యే కేతిరెడ్డి కనుసన్నల్లో డి.ఎస్.పి, సీఐ పని చేస్తున్నారని ఆరోపించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంల ఇంకా ఉద్రిక్తత పరిస్థితులో కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టేందుకు వచ్చిన బీజేపీ లీడర్లను కొట్టడం పెను సంచలనంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పరామర్శించారు.
ధర్మవరం ఎమ్మెల్యే కేతి రెడ్డి వెంకటరామిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపి నేత గోనుగుంట సూర్యనారాయణ. కేతిరెడ్డి భూకబ్జాలు, అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. గుడ్ మార్నింగ్ పేరు చెప్పి ఆయన చేస్తున్న అవినీతి అంతా ప్రజలకు తెలుసన్నారు. ఈ చంపుడు రాజకీయాలు తిమ్మపల్లిలో చూసుకోవాలే కానీ ధర్మవరంలో కాదని హెచ్చరించారు. ధర్మవరంలో దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోమని.. మళ్లీ తిమ్మంపల్లి పంపిస్తామన్నారు సూర్యనారయణ.
కేతిరెడ్డి సమక్షంలోనే బీజేపీ కార్యకర్తలను చంపాలని చూశారన్నారు సూర్యనారాయణ. ఎమ్మెల్యే కేతిరెడ్డి కనుసన్నల్లో డి.ఎస్.పి, సీఐ పని చేస్తున్నారని ఆరోపించారు. నాలుగు జతల బట్టలు పెట్టుకొని వచ్చిన కేతిరెడ్డికి వెయ్యి కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అదంతా ధర్మవరం నియోజకవర్గ ప్రజల సొమ్ము కాదా అని నిలదీశారు. దౌర్జన్యం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భీష్మించారు సూర్యనారాయణ.
ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చిన సూర్యనారాయణ... ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. దాడికి పాల్పడిన వారిని, చేయించిన ఎమ్మెల్యే కేతిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దికారు. పోలీసులు వచ్చి దాడికి పాల్పడిన వారిని అందరిని తప్పకుండా అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు బిజేపి నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు.
బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారితోపాటు ఎమ్మెల్యేని పోలీసులు అరెస్టు చేయాలని లేకుంటే హైకోర్ట్‌కు వెళ్లి ఎమ్మెల్యే అరాచకాలపై పోరాడుతానన్నారు సూర్యనారాయణ. ఎన్ని దాడులు చేసినా తగ్గేదే లేదన్నారు. పది మంది వస్తే వందమందితో వస్తామని... వాళ్లు వంద మందితో వస్తే తాము వేయి మందితో వస్తామన్నారు. వెనక్కి తగ్గేదేలేదు అన్నారు. ఈ రోజు తాము అనుకుంటే అవతలి పార్టీ వాళ్లు ఒక్కరు మిగిలేవారు కారని... కానీ ధర్మవరం ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నామన్నారు.