Kurnool News: దేవుణ్ని చూపిస్తానన్న బాలుడు, ఎగబడ్డ 10 ఊర్ల ప్రజలు! చివర్లో ట్విస్ట్!
Kurnool Boy News: ప్రజలకు దేవుడి మీద ఉన్న భక్తితో కొందరు వ్యాపారం చేస్తూ ఉంటారు. మేం దేవుళ్ళమని.. దేవుడితో మాట్లాడతామని బాబాలు చెప్తే వాటిని నమ్మేస్తూ ఉంటారు. అలాంటి ఘటన కర్నూలులో జరిగింది.
AP News: దేవుడిని చూపిస్తా అంటున్న బాలుడుకర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని కురవపల్లి గ్రామంలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మొహరం పండుగ సమీపిస్తుండడంతో గ్రామంలోని ప్రజలు మొహరం వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఇదే తరుణంలో 15 ఏళ్ల వయసున్న ఒక బాలుడు చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మారు ఆ గ్రామ ప్రజలు. సహజంగా మొహరం వేడుకలు అంటేనే దేవుళ్లను ఎత్తుకొని ఊరేగిస్తారు. ఆ సమయంలో కొందరిపై దేవుడు ఉన్నాడని మన నమ్మకం. అలా ఒక 15 ఏళ్ల బాలుడిపై పీర్ల స్వాముల్లో ఒక స్వామి ఆ పిల్లోడిపై పూనాడని ఆ గ్రామస్తులు ఆ పిల్లోడు చెప్పిందల్లా చేశారు. గ్రామ శివారులోని పొలంలో పీర్ల స్వామి ఉన్నాడని ఆ స్వామి మట్టిలో కూరుకుపోయాడని అక్కడికి వెళ్లి తవ్వితే స్వామి కనిపిస్తాడని ఆ బాలుడు చెప్పడంతో గ్రామ ప్రజలు గ్రామ శివారులోని పొలంలో వెతకడం ప్రారంభించారు.
దేవుడు కనిపించాడా ?
15 ఏళ్ల బాలుడు చెప్పిన విధంగానే గ్రామ శివారులోని పొలంలో కురవపల్లి గ్రామస్తులే కాక చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా దేవుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఒకరికి ఒకరు అంటూ ఏం జరుగుతుందో అర్థం గాక గుంపులుగా జనం గుమిగూడారు. అటుగా వెళుతున్న వాహనదారులు సైతం దేవుడు కనిపిస్తాడని అక్కడే పడుకున్నారు. ఒక ఊరు రెండు ఊర్లతో ప్రారంభమైన వెతుకులాట చుట్టుపక్కల 10 గ్రామాలకు ఆ విషయం పాకింది. ఒక పిల్లవాడు దేవుణ్ని చూపిస్తున్నాడు అని నమ్మిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వేల సంఖ్యలో కురవపల్లి గ్రామానికి చేరుకున్నారు.
అయితే దేవుని చూపిస్తానన్న ఆ పిల్లవాడు ఆ పొలంలో అటూ ఇటూ తిరుగుతూ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆఖరికి ఒకచోట గుంత తవ్వి ఒక రాయికి కొత్త జాకెట్ పీసులను చుట్టి ఇతనే దేవుడు అని చూపించాడు. నిజంగానే ఆ బాలుడు దేవున్ని చూపిస్తాడని ఆ గ్రామ ప్రజలందరూ నమ్మి తన వెంటనే నడిచారు.
మా గ్రామంలో దేవుడు కనిపిస్తాడని ఈరోజు దేవుడు మా గ్రామ పొలాల్లో పుడుతున్న రోజని గ్రామంలోని అందరూ తండలుగా వచ్చామని కంటిమీద పునుగు లేకుండా దేవుడి కోసం వెతుకుతున్నామని కురవపల్లి గ్రామస్తుడు చెబుతున్నాడు. దేవుడంటే ఎవరికైనా నమ్మకమే. మారుతున్న కాలం ఆధునిక టెక్నాలజీలతో ఎంతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలాంటివన్నీ కూడా నమ్మి ఊరి ప్రజలు ఇంత దూరం రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.