Car Washed Away In Kurnool: భారీ వర్షాలకు కొట్టుకుపోయిన కారు ఆచూకీ లభ్యం, అందులో ఉన్నవారు ఏమయ్యారు !
A Car Washed Away: కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వర్ష నీటి ఉద్ధృతికి ఓ కారు కళ్లివంక వాగులో కొట్టుకుపోవడం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో ఈ ఘటన జరిగింది.
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో పాటు రాయలసీమలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో వర్ష నీటి ఉద్ధృతికి ఓ కారు కళ్లివంక వాగులో కొట్టుకుపోవడం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో ఈ ఘటన జరిగింది. గుంతకల్ నుంచి ఆలూరు వెళ్తుండగా నీటి ప్రవాహం అధికం కావడంతో కారు కొట్టుకుపోయిందని పోలీసులు చెబుతున్నారు. కారులో ఐదుగురు వరకు ఉండొచ్చునని తెలుస్తోంది.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్సై రామానుజులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నీటి ప్రవాహం ఎటు వెళ్తుంది, కారు ఎంతదూరం కొట్టుకుపోయిది అనే కోణంలోగాలింపు చర్యలు చేపట్టారు. కల్లివంక ప్రవాహం అధికం కావడంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఆలూరు - గుంతకల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో కారు కొట్టుకుపోయినట్లు గుర్తించారు.
కారు ఆచూకీ లభ్యం..
సోమవారం ఉదయం నీటి ప్రవాహం తగ్గడంతో కారు ఆచూకీ లభ్యమైంది. ఫైర్, రెస్క్యూ టీమ్ వరద నీటిలో కొట్టుకుపోయిన కారును గుర్తించినట్లు తెలుస్తోంది. వాహనంలో ఒకరు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి కారును రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. మిగతా వారి ఆచూకీ కోసం పోలీసులు, రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. కారులో తాను ఒక్కడినే ఉన్నానని కర్ణాటకకు చెందిన వ్యక్తి చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున, మరికొందరు వాహనదారులు, స్థానికులు చూస్తుండగానే ఒక్కసారిగా కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు చెప్పారు. కారు కొట్టుకుపోయిన విషయాన్ని వీరు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
పిడుగులు పడతాయి జాగ్రత్త.. విపత్తుల నిర్వహణ సంస్థ
ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని డా.బిఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ డైరెక్టర్ హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉన్నాయని, ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశువులు - గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వారిని హెచ్చరించారు.
Also Read: JP Nadda AP Tour: నేడు ఏపీ పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పూర్తి షెడ్యూల్ ఇదే