Kadapa RIMS : కడప రిమ్స్ లో పసికందుల మరణాలు- రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి!
Kadapa RIMS : కడప రిమ్స్ ఆసుప్తత్రిలో పసికందుల మరణాలపై ఆందోళన నెలకొన్నాయి. ప్రతిపక్షాలు, బంధువులు ఆసుపత్రి ముందు నిరసనలు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం అన్నీ బాగానే ఉన్నాయని చెబుతోంది.
Kadapa RIMS : సీఎం సొంత జిల్లా కడప రిమ్స్ లో నవజాతి శిశువుల మరణాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 3 గురు శిశువులు మృత్యువాతపడ్డారు. కడప రిమ్స్ లో వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే శిశువులు మృత్యువాత పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు చంటిబిడ్డల తల్లిదండ్రులు. రిమ్స్ లో అన్నీ సౌకర్యాలు ఉన్నాయని వైద్యాధికారుల ధోరణి పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా రెండు రోజుల్లో 3 గురు శిశువులు చనిపోవడంతో ప్రతిపక్షాలు రిమ్స్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైఖరిపై సందేహం ఉందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇప్పటికే హాట్ టాపిక్ గా మారాయి. కడప రిమ్స్ ఆసుపత్రిలో ముగ్గురు శిశువులు మరణించడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం అని జనసేన, టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రిమ్స్ లో విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం వల్లే తమ బిడ్డలు మృతి చెందారని కన్నవారు ఆరోపిస్తుండగా, ఆ తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం ఇస్తున్న సమాధానం పలు సందేహాలకు తావిస్తోంది. ఆర్డీవో చెబుతున్న మాటలను బట్టి చూస్తే, రిమ్స్ లో జరిగిన ఘటనను సర్దుబాటు చేసే తాపత్రయమే కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
స్పందించిన కలెక్టర్
జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరత లేదని ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి అంటున్నారు. కడప రిమ్స్ సర్వోదయ ప్రభుత్వ ఆసుపత్రి ఘటనపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కడప ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు. రిమ్స్ లో చిన్న పిల్లల వార్డులో పిల్లలకు అందుతున్న వైద్య సేవలను వాకబు చేయటంతో పాటు వసతులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ ముగ్గురు శిశువుల మృతి ఘటనపై రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆందోళనలు చేస్తున్న వారితో మాట్లాడానన్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ లను విచారించగా శుక్రవారం నుండి శనివారం ఉదయం 11 గం.లకు వరకు ముగ్గురు నవ జాత శిశువులు వివిధ జబ్బుల రీత్యా చనిపోయారన్నారు. ఇందులో దువ్వూరుకు చెందిన శభాన బిడ్డ ఈ నెల 8వ తేది రాత్రి 10.30 గం లకు శ్వాసలేకుండా పుట్టిందన్నారు. బాక్రా పేటకు చెందిన 11 నెలల యోగేష్ కుమార్ రెడ్డి మెదడుకు సంబందించిన వ్యాధి కారణంగా మరణించాడు. సింహాద్రిపురానికి చెందిన చంద్రిక బిడ్డ(4 నెలలు) తీవ్రమైన నిమోనియా కారణంగా చనిపోయిన్నట్లు తెలిసిందన్నారు.
వైద్య పరికరాల కొరత లేదంటున్న వైద్యాధికారులు
రిమ్స్ ఆసుపత్రిలో ఎటువంటి వైద్య పరికరాల కొరత లేదని, కరోనా సమయంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ పడకలను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశామని ఆర్డీవో తెలిపారు. రిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయన్నారు. ప్రత్యేకంగా రిమ్స్ లో గైనిక్, నియో నాటల్ శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ శాఖలకు, ఆసుపత్రి ప్రతిష్టలకు భంగం కలుగకుండా చూసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ దృష్టికి గాని, తమ దృష్టికి గాని తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తామన్నారు. అంతేకాని ప్రజలు భయాందోళనలు చేసేలా వార్తలను ప్రసారం చేయడం సమంజసం కాదన్నారు. జిల్లాకు, రిమ్స్ ఆసుపత్రికి మంచి పేరు తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాగునీటి వసతి లేక ఇబ్బందులు
కడప రిమ్స్ లో తాగునీటి వసతిలేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లల వార్డు దగ్గర ఉన్న వాటర్ ప్లాంట్ లో నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం సొంత జిల్లాలో రిమ్స్ లో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉన్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని వెంటనే తాగు నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు రోగుల కుటుంబ సభ్యులు. ఎండలు దంచికొడుతుంటే రిమ్స్ లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.