AP MLC Elections : కోలా గురువులు ఓటమి - ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో జయమంగళ గెలుపు !
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయ మంగళ వెంకటరమణ విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్లు తక్కువ రావడంతో కోలా గురువులు పరాజయం పాలయ్యారు.
AP MLC Elections : ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ అందరి కంటే ఎక్కువగా 23 తొలి ప్రాదాన్యతా ఓట్లు తెచ్చుకోవడంతో మొదటే విజయం సాధించారు. అయితే వైఎస్ఆర్‌సీపీ నిలబెట్టిన ఏడుగురు అభ్యర్థుల్లో ఒకరు ఖాయంగా ఓటమి ఎదుర్కోవాల్సి ఉంది. మిగతా అభ్యర్థులందరికీ 22 ఓట్లు రాగా జయ మంగళ వెంకటరమణ, కోలా గురువులుకు మాత్రమే 21 ఓట్లు వచ్చాయి. వీరికి వచ్చిన ఓట్లలో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించి.. కోలా గురువులును ఓడిపోయినట్లుగా ప్రకటించారు. జయ మంగళ వెంకటరమణ ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు.
ఎమ్మెల్సీ స్థానం కోసం వైఎస్ఆర్‌సీపీలో చేరిన జయ మంగళ వెంకటరమణ
నిన్నామొన్నటి వరకూ జయ మంగళ వెంకట రమణ టీడీపీలోనే ఉన్నారు. ఆయన కైకలూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నారు. రాత్రికి రాత్రే ఆయన పార్టీ మారిపోయారు. సీఎం జగన్ ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో పార్టీ ఫిరాయించారు. మొదట స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా చాన్సిస్తారని అనుకున్నారు. కానీ తర్వాత సీఎం జగన్ వ్యూహం మార్చి ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపాలని నిర్ణయించారు. చివరికి ఉత్కంఠగా ఎన్నికలు జరిగినా ఆయన పదవి నిలబెట్టుకున్నారు. దీంతో కోలా గురువులు పరాజయం పాలయ్యారు. కోలా గురువులుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించడం కష్టం కావడంతో ఆయనను ఎమ్మెల్సీ చేయాలనుకున్నారు. కానీ పరిస్థితి అనూకలించలేదు.
క్రాస్ ఓటింగ్ చేసిన వారి కోసం వైసీపీ విశ్లేషణ
కోలా గురువులు, జయ మంగళం వెంకటరమణకు కేటాయించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేశారు. ఇప్పుడు వారికి కేటాయించిన ఎమ్మెల్యేలందరిపై వైసీపీ హైకమాండ్ అనుమానపడే అవకాశం ఉంది. ప్రధానంగా వారిలో ఎవరు పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న అంశం ఆధారంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడింది ఎవరనే దానిపై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తామని గట్టి నమ్మకం పెట్టుకున్న వైసీపీకి ... ఆ పార్టీ హైకమాండ్‌కు ఏదీ కలసి రావడం లేదు. పక్కా జాగ్రత్తలు తీసుకున్నా.. ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయకుండా ఆపలేకపోయారు. టీడీపీ నుంచి వచ్చి చేరిన నలుగురు, జనసేన నుంచి వచ్చి చేరిన ఒకరితో గెలుపు ఖాయమనుకున్నారు కానీ.. తమ పార్టీ ఎమ్మెల్యేలు షాకిస్తారని అనుకోలే్దు. ఈ పరిణామాలపై వైఎస్ఆర్‌సీపీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలపై సీఎం జగన్ పట్టు కోల్పోయారా అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ ఓటమిపై ఇంకా వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.
వైసీపీలో నిరాశ
ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామనుకున్న ఎమ్మెల్సీ సీట్లలో ఓడిపోవడంతో వైసీపీ క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు ఐదుగురు ఓట్లేసినా తమ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ చేయడం వారిని ఇబ్బంది పెడుతోంది.