Jada Sravan Kumar: హత్యలు, మారణహోమాలు సృష్టించే జగన్.. నువ్వా మా భవిష్యత్: జడ శ్రావణ్ ఘాటు వ్యాఖ్యలు
Jada Sravan Kumar: జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని తీసుకురావడంపై జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ విమర్శలు గుప్పించారు.
Jada Sravan Kumar: సీఎం వైఎస్ జగన్ ఏపీ రాష్ట్ర అభివృద్ధి ఏం చేశారని.. జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమం పెట్టుకుంటున్నారని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ విమర్శించారు. జగనన్నకు చెప్పుకుందాం.. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. ఉదయం లేవగానే హత్యలు, మారణహోమాలు సృష్టించే జగన్.. నువ్వా మా భవిష్యత్ అని జడ శ్రావణ్ ప్రశ్నించారు. మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉంటున్న నవీన్ పట్నాయక్ లాంటి వారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి, జగన్ లాంటి వారు కాదని ఆయన విమర్శించారు.
పదవులు ఇస్తే సరిపోతుందా, దళితులకు ఏం మేలు చేశారు
దళితులకు హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోస్టులు ఇస్తే సరిపోతుందా.. ఎస్సీ, ఎస్టీలకు సీఎం జగన్ ఏం మేలు చేశారని జడ శ్రావణ్ ప్రశ్నించారు. వెనకబడిన వర్గాలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఏం చేసిందో ఆధారాలతో సహా చూపిస్తానని అన్నారు. దళితులపై దాడుల విషయంలో సమాధానం చెప్పాలని నిలదీశారు.
'గడప గడపకు దగా ప్రభుత్వం' పేరుతో పుస్తకం ఆవిష్కరిస్తాం..!
దాడులకు, హత్యలకు గురైన డాక్టర్ సుధాకర్, కిరణ్, శిరో ముండనం వరప్రసాద్, రమ్య కుటుంబాలను పరామర్శించారా అని ముఖ్యమంత్రిని శ్రావణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, దళితులపై జరుగుతున్న దాడులపై ఉద్యమిస్తానని జడ శ్రావణ్ తెలిపారు. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి రోజున విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ స్మారక సభలో 'గడప గడపకు దగా ప్రభుత్వం' పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. 'గడప గడపకు దగా ప్రభుత్వం' పుస్తకాన్ని ప్రతి దళిత గడపకు అందిస్తామని జడ శ్రావణ్ తెలిపారు. 1500 మంది దళిత బిడ్డలపై జరిగిన దాడుల వివరాలను ఆధారాలతో సహా దళిత బిడ్డలకు అందిస్తామని వెల్లడించారు. ఈ పుస్తకమే జగన్ ప్రభుత్వానికి రాజకీయ సమాధి కడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 175 శాసన నియోజక వర్గాల్లో, 25 పార్లమెంటు నియోజక వర్గాల్లో పోటీకు జైభీమ్ భారత్ పార్టీ సిద్ధంగా ఉందని జడ శ్రావణ్ తెలిపారు. ప్రజలు తమను ఆదరించాలని కోరారు.
రాష్ట్ర ప్రజలు కుమిలిపోతున్నారు: జడ శ్రావణ్
రాష్ట్రంలో ఇసుక కొరతతో అసంఘటిత రంగాల కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సి వస్తోందని జడ శ్రావణ్ తెలిపారు. రాష్ట్రానికి ఉన్న 2 లక్షల 46 వేల కోట్ల అప్పును 10 లక్షల కోట్ల అప్పుగా చేశారని జడ శ్రావణ్ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిపై అప్పుల కుంపటి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలను 151 స్థానాల్లో గెలిపించినందుకు ప్రజలు కుమిలి పోతున్నారని జడ శ్రావణ్ అన్నారు. విజ్ఞత కలిగిన ఎమ్మెల్యేలు జగన్ పార్టీ నుండి బయటకు రావాలని సూచించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చారని తెలిపారు. చాలా మంది పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారని, ఇతర పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారని జడ శ్రావణ్ తెలిపారు.