Jagan ED court : పరిగణనలోకి ఈడీ చార్జిషీట్లు.. సెప్టెంబర్ 22న హాజరు కావాలని జగన్‌కు కోర్టు ఆదేశం !
వాన్‌పిక్, లేపాక్షి క్విడ్ ప్రో కో కేసుల్లో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సెప్టెంబర్ 22న హాజరు కావాలని జగన్‌తో పాటు సహ నిందితులను ఆదేశించింది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాఖలు చేసిన వాన్‌పిక్, లేపాక్షి చార్జిషీట్లను ఈడీ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రెండు రోజుల కింద ఈ రెండు కేసుల్లో అభియోగాలను ఈడీ నమోదు చేసింది. బుధవారం జరిగిన విచారణలో ఈడీ కోర్టు వీటిని పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. వాన్‌పిక్ కేసులో కేసులో ప్రధాన నిందితుడుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏ -2 గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇతర నిందితులుగా మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణా రావు, నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు సివిల్ సర్వీస్ అధికారులు ఉన్నారు. జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన 12 కంపెనీలకు కూడా ఈడీ కోర్టు నోటీసులు జారీ చేసింది.
లేపాక్షి కేసులోనూ ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జగన్, విజయసాయిరెడ్డిలతో పాటు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసింది. పారిశ్రామికవేత్త శ్యాంప్రసాద్ రెడ్డి, ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య కూడా నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 22వ తేదీన కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. వాన్‌పిక్, లేపాక్షి కేసుల్లో క్విడ్ ప్రో కో వ్యవహారంలో అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడినట్లుగా ఈడీ కేసులు నమోదు చేసింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అల్‌ఖైమా సంయుక్త భాగస్వామ్యంతో వాన్‌పిక్ ప్రాజెక్టును నిమ్మగడ్డ ప్రసాద్ చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్ ప్రభుత్వం భూములను కేటాయించించింది. ఇందుకు ప్రతిఫలంగా నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో రూ.850 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారు. వైఎస్సార్ ఫౌండేషన్‌కు రూ.7 కోట్ల విరాళాలిచ్చారు. ఇదంతా క్విడ్ ప్రో కోనేనని సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ చార్జిషీటు ఆధారంగా ఈడీ కూడా అక్రమ ద్రవ్య చలామణీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో ప్రభుత్వం వద్ద భూములు తీసుకుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ. 800 కోట్లు తీసుకున్నారు. వాటిని ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి ఖాతాలకు మళ్లించారు. ఆయన జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని సీబీఐ కేసు నమోదు చేసింది . ఆ చార్జిషీట్ ఆధారంగా ఈడీ కూడా కేసులు పెట్టింది.