Assembly Jagan : సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందనే వెళ్లలేదు.. అందరికీ సాయం చేశాం.. అసెంబ్లీలో సీఎం జగన్ !
సీఎం వెళ్తే సహాయ కార్యక్రమాలు నిలిపివేసి అధికారులు సీఎం పర్యటననే చూసుకుంటారని అందుకే వెళ్లలేదని జగన్ అసెంబ్లీలో తెలిపారు. వరద నష్టంపై అసెంబ్లీలో ప్రకటన చేశారు.
రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం సృష్టించినా, కొన్ని వేల మంది బాధితులుగా మారినా పరిశీలించలేదని వస్తున్న విమర్శలకు అసెంబ్లీలో సీఎం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అక్కడ పర్యటనకు వెళ్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకాలకు కలుగుతాయనే వెళ్లలేదని సీఎం స్పష్టం చేశారు. తాను వెళ్లడం వల్ల అధికారులంతా తన వెంటే తిరుగుతారని దీని వల్ల సహాయం ఆగిపోతుందన్నారు.ఈ విషయంపై తాను ఉన్నతాధికారులతో మాట్లాడితే ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా ఎప్పుడూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించలేదని గుర్తు చేశారు.
Also Read: ప్రజలు చనిపోయిన తర్వాత స్పందిస్తారా ? ఏపీలో తుగ్లక్ ప్రభుత్వముందన్న చంద్రబాబు !
వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించానని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆయా జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందర్నీ అక్కడే ఉండమని చెప్పానన్నారు. అలాగే రోజూ సమీక్షలు చేస్తూ కావాల్సిన ఆదేశాలు ఎప్పటికప్పుడు ఇస్తున్నానని గుర్తు చేశారు. ఏరియల్ సర్వే కూడా చేశానని స్పష్టం చేశారు. సహాయ కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత ఖచ్చితంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి..అధికారులందరూ సహాయ కార్యక్రమాలు బాగా చేశారా లేదా అనికనుక్కుంటానని స్పష్టం చేశారు. కడప తన సొంత జిల్లా అని .. ప్రేమ కాస్త ఎక్కువే ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.
Also Read: రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం చేయండి.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సీఎం జగన్ లేఖ !
వరద బాధిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు దారుణమైన మాటలు మాట్లాడారన్నారు. గాల్లో వచ్చారు.. గాల్లోనే పోతారని మాట్లాడారని.. ఆయన సంస్కారానికి ఓ నమస్కారమని అన్నారు. తాము శరవేగంగా సహాయ కార్యక్రమాలు అందించామని.. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా మానవత్వం చూపించారా అని ప్రశ్నించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు శరవేగంగా రూ. ఐదు లక్షలు ఇచ్చామన్నారు. వెయ్యి కాదు.. రెండు వేలు కాదు ఏకంగా 90వేల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. పశువులు నష్టపోయిన వారికి కూడా నష్టపరిహారం ఇచ్చామని జగన్ ప్రకటించారు. అన్ని వర్గాలకూ.. నష్టపోయిన వారికి పరిహారం అందించామన్నారు. ఇంకా ఎవరికైనా ఇవ్వాలంటే ఇస్తామన్నారు. ఇళ్లు నిర్మించుకోవడానికి కూడా సాయం చేస్తున్నామన్నారు.
Also Read : ఆ 60 మందివి ప్రభుత్వ హత్యలే, ఆ ఆర్తనాదాలు అసెంబ్లీలో జగన్‌కు ఆనందం.. చంద్రబాబు వ్యాఖ్యలు
అసాధారణ రీతిలో వచ్చిన వాన, వరదల వల్ల ఉపద్రవం వచ్చిందని జగన్ స్పష్టం చేశారు. ఎక్కడా మానవ తప్పిదం లేదన్నారు. ముందస్తుగానే ఆయా గ్రామాల ప్రజలన్నింటినీ అప్రమత్తం చేశారన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చురుకుగా స్పందించలేదని ప్రచారం చేస్తున్నారు కాబట్టి తాను ఈ విషయం చెబుతున్నాన్నారు. ఓ పత్రికలో ఈ మేరకు వచ్చిన ఓ వార్తను సీఎం అసెంబ్లీలో చూపించారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రిజర్వాయర్‌ను యుద్ధ ప్రాతిపదికన బాగు చేస్తామని.. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామన్నారు.
Also Read : నిమిషాల్లో విరుచుకుపడిన ప్రళయం ! పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల విలయం ఎలా జరిగిందంటే ?