Andhra Pradesh: నంది పొట్టలో వజ్రాలు ఉన్నాయంటూ ప్రచారం - విగ్రహాలు ధ్వంసం చేసిన దుండగులు
Andhrapradesh News: ఏపీలో గుప్త నిధుల వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో నంది విగ్రహంలో వజ్రాలున్నాయని వాటిని ధ్వంసం చేశారు.

Andhrapradesh News: ఏపీలో గుప్త నిధుల వేటగాళ్లు రెచ్చిపోయారు. తాజాగా, 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిట్టికాయగుళ్ల గ్రామంలోని శివాలయంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. గ్రామ సమీపంలోని పిటికేశ్వర ఆలయంలో నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయంలో గతంలో కూడా గుప్త నిధుల కోసం అన్వేషణ జరిగినట్లు తెలుస్తోంది. నంది విగ్రహం పొట్టలో వజ్రాలున్నాయని వదంతులు వ్యాపించడంతో విగ్రహాలు ధ్వంసం చేశారని గ్రామస్థులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
కనపర్తిలోనూ
ఇటీవల ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తిలో గుప్త నిధుల వేటగాళ్లు రెచ్చిపోయారు. గ్రామంలోని పురాతన శివాలయంలో బీభత్సం సృష్టించారు. క్రీ.శ రెండో శతాబ్దం నాటి ఏలేశ్వర స్వామి పేరుతో ఉన్న శివాలయంలో అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ కూడా నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహానికి రెండు రంధ్రాలు చేసి జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేశారు. ఈ దుశ్చర్యతో గ్రామంలో అలజడి నెలకొంది. దీనిపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే, పురాతన ఆలయాలనే దుండగులు టార్గెట్ చేస్తుండడంతో గ్రామంలో రక్షణ చర్యలు చేపట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
పురాతన ఆలయాలు భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదకు ఆనవాళ్లని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి చరిత్ర కలిగిన ఆలయాలపై గుప్త నిధుల వేటగాళ్లు కళ్లు పడుతున్నాయని, గుప్త నిధుల పేరుతో ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని, వీటిని అరికట్టేలా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

