Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
Andhra News: నైరుతి బంగాళాఖాతంలో గడిచిన 6 గంటల్లో ఫెంగల్ తుపాను 10 కి.మీ వేగంతో కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్ వస్తాయని హెచ్చరించింది.
Fengal Cyclone Effect In AP Districts: 'ఫెంగల్' తుపాను (Fengal Cyclone) ప్రభావంతో ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema) ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 6 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో తుపాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తీరానికి చేరుకునే సమయానికి నెమ్మదిగా కదిలే ఛాన్స్ ఉందని చెప్పారు. శనివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు - పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 30, 2024
'ఫెంగల్ ' తుపాన్
గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిమీ వేగంతో కదులుతున్న తుపాన్
ప్రస్తుతానికి పుదుచ్చేరికి 100 కి.మీ, చెన్నైకి 100 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
తీరాలకు చేరుకునే సమయంలో నెమ్మదిగా కదిలే అవకాశం pic.twitter.com/qTeg4Z4WUO
ఈ జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్
తుపాను ప్రభావంతో తిరుపతి (Tirupati), నెల్లూరు (Nellore), ప్రకాశం జిల్లాల్లో తీరం వెంబడి 70 నుంచి 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ప్లాష్ ఫ్లడ్స్‌కు అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆకస్మిక వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని సూచించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.
విమానాల రాకపోకలు బంద్
అటు, తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ నుంచి చెన్నై వెళ్లే పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై - విశాఖ - చెన్నై, తిరుపతి - విశాఖ - తిరుపతి విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. అలాగే, హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన 3 విమానాలు, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన 3 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన 7 విమానాలు రద్దు చేశారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే చెన్నై ఎయిర్‌పోర్టును (Chennai Airport) మూసేసినట్లు అధికారులు ప్రకటించారు.
సీఎం చంద్రబాబు సమీక్ష
మరోవైపు, తుపాను హెచ్చరికలతో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ, కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో చర్చించారు. అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.