AP New Industries : ఏపీకి ఐదు కొత్త పరిశ్రమలు.. రూ. 2వేల కోట్లకుపైగా పెట్టుబడులు !
ఏపీలో ఐదు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సీఎం నేతృత్వంలో పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 2వేల కోట్లకుపైగా పెట్టుబడి, ఏడు వేలకుపైగా ఉద్యోగాలు లభిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐదు పరిశ్రమల ద్వారా 7,683 ఉద్యోగాలు యువతకు దక్కనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డులో ఈ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం రూ. 2,134 కోట్ల పెట్టుబడి ఏపీకి వస్తుంది.
పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, రిటైల్ లిమిటెడ్ ఏర్పాటు కానుంది. ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్లను తయారు చేస్తారు. రూ.110 కోట్ల పెట్టుబడి పెడతారు. ఇక బద్వేలులో సెంచురీ సంస్థ ప్లైవుడ్ తయారీ పరిశ్రమ పెట్టనుంది. మొత్తం రూ.956 కోట్ల పెట్టుబడి, 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తారు. రైతుల వద్ద నుంచి యాకలిప్టస్ చెట్లను కొనుగోలు చేయడం ద్వారా రైతులకూ మేలు చేస్తారు. కడప జిల్లాలో పలు చోట్ల రైతులు యాకలిప్టస్ చెట్లను పెంచుతారు. ఇప్పటి వరకూ వాటికి మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. సెంచరీ పరిశ్రమ రాకతో వారి సమస్యలు తీరుతాయి.
Also Read : మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పడి తీరుతాయి.. త్వరలో చూస్తారు
ఇక కడప జిల్లాలోనే కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పనుంది. రూ.127 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 1800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పరిశ్రమగా తూర్పుగోదావరి జిల్లాలో ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమనుగ్రాసిం ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుంది. ఈ కంపెనీ ద్వారా రూ.861 కోట్ల పెట్టుబడి.. 405 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. మొత్తంగా ఐదు పరిశ్రమలకు అనుమతి ఇస్తే అందులో నాలుగు కడప జిల్లాలోనే ఏర్పాటవుతున్నాయి.
పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కంపెనీల విస్తరణకు అవకాశాలున్నచోట వారికి భూములు కేటాయించాలని..భవిష్యత్తులో వారు పరిశ్రమలను విస్తరించాలనుకుంటే అందుకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలని సూచించారు.
Also Read: AP Highcourt : అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !