AP Elections 2024: ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ప్రకటించిన ఈసీ, వెబ్‌సైట్‌లోనూ వివరాలు
Andhra Pradesh Elections 2024: ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రిటర్నింగ్ అధికారులకు ఆ జాబితాను ఈసీ పంపింది.
Ineligible candidates to contest in AP Elections 2024: అమరావతి: మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేయడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దాంతో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు అప్రమత్తం అయ్యారు. నగదు బదిలీలు, నగదు తరలింపు, బంగారం సహా పెద్ద ఎత్తున చీరలు సహా ఇతరత్రా సామాగ్రి ఓటర్లకు పంపిణీపై ఎన్నికల అధికారులు ఫోకస్ చేశారు. ఏపీలో ఇదివరకే పలుచోట్ల నగదు, మద్యం పట్టుబడగా.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రభుత్వ అధికారులు, వాలంటీర్లపై ఈసీ చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
రిటర్నింగ్ అధికారుల చేతికి అనర్హుల జాబితా
ఏపీలో ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం (Election Commission) రిటర్నింగ్ అధికారులకు పంపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మొత్తంగా 51 మంది త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం (Representation of the People Act) సెక్షన్ 10ఏ ప్రకారం జాబితాలోని 51 మంది వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని పేర్కొంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీకి అనర్హుల జాబితాను ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ లోనూ అందుబాటులో ఉంచుతామని ఈసీ స్పష్టం చేసింది. వారి జాబితాను ఏపీలోని రిటర్నింగ్ అధికారులు అందుబాటులో ఉంచుకోవాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఒకే పేరు ఉన్న కొందరు వ్యక్తులను సైతం అనర్హులుగా ఈసీ పరిగణించింది. ఉదాహరణకు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అనర్హుల జాబితాలో చేర్చింది ఈసీ. గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (కొడాలి నాని) మరోసారి బరిలోకి దిగుతున్నారని తెలిసిందే. ఇవే తనకు చివరి ఎన్నికలు అని సైతం కొడాలి నాని స్పష్టం చేశారు. కాగా, 2024 మార్చి 15 నాటికి రూపొందించిన అనర్హుల జాబితాను తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.