AP Assembly Sessions: సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు- టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డ్రెస్ కోడ్ ఆదేశాలు!
Andhra Pradesh Assembly Sessions | ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయని తెలిసిందే. ఈ సమావేశాలకు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాతో రావాలని టీడీఎల్పీ నిర్ణయించింది.
Dress Code For TDP MLAs and MLCs for AP Assembly Sessions | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏపీలో సోమవారం (జులై 22) నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని తెలిసిందే. దాదాపు అయిదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ డ్రెస్ కోడ్ పాటించాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఈ సెషన్స్‌కు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు రంగు దుస్తులు ధరించి, సైకిల్ గుర్తు ఉన్న కండువాలతో హాజరు కావాలని టీడీఎల్పీ సూచించింది.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలతో పూర్తి కానుంది. ఎన్నికల ఏడాది కావడంతో కేవలం కొన్ని నెలలకు తాత్కాలిక బడ్జెట్ ను గత ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, ఆ బడ్జెట్ గడువు జులై 31తో ముగియనుంది. దాంతో రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ ఆర్థిక ఏడాది పూర్తయ్యే వరకు మిగతా నెలలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
పూర్తి స్థాయి బడ్జెట్ కాదా?
కూటమి ప్రభుత్వం అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకుంది. కానీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో లేదని తెలుస్తోంది. మూడు, నాలులకు తగ్గట్లుగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సోమవారం ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును జులై 23న (బుధవారం నాడు) సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై ఇదివరకే నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం, శాంతి భద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీ వేదికగా విడుదల చేసి చర్చించనున్నారు.
సోమవారం ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి రానున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కనిపించే కండువా లాంటివి ధరించి సెషన్స్‌లో పాల్గొనాలని టీడీఎల్పీ సూచించింది.
Also Read: YS Jagan: గవర్నర్‌ను కలిసిన మాజీ సీఎం జగన్ - టీడీపీ దాడులపై ఫిర్యాదు