YS Jagan: గవర్నర్‌ను కలిసిన మాజీ సీఎం జగన్ - టీడీపీ దాడులపై ఫిర్యాదు
Andhrapradesh News: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మాజీ సీఎం జగన్ ఆదివారం రాజ్ భవన్‌లో కలిశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని ఫిర్యాదు చేశారు.
Ys Jagan Meet Governor Abdul Nazeer: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను (Abdul Nazeer) ఆదివారం సాయంత్రం రాజ్ భవన్‌లో కలిశారు. ఏపీలో పరిస్థితులపై వైసీపీ నాయకులతో కలిసి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని, అరాచక పాలన సాగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హత్యలు, దాడులు, విధ్వంసాలు పెరిగాయని అన్నారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, గత 45 రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని గవర్నర్‌కు వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలు, వీడియోలను గవర్నర్‌కు అందించినట్లు వైసీపీ నేతలు తెలిపారు.
ఢిల్లీలో ధర్నా
వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో దారుణంగా నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ మరుసటి రోజే వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసంపై రాళ్ల దాడి, ఎంపీ మిథున్‌రెడ్డి కార్లు దహనం వంటి ఘటనలు సైతం ఆందోళన కలిగించాయి. వినుకొండలో రషిద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. ఈ నెల 24న (బుధవారం) ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీని కలిసి పరిస్థితిని వివరిస్తామని చెప్పారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి పార్లమెంట్ వద్ద ధర్నా చేస్తామని ప్రకటించారు.