Jagan Vinukonda Tour: జగన్ వినుకొండ పర్యటనతో క్యాడర్‌లో జోష్, వైసీపీ అధినేత సరికొత్త కార్యాచరణకు సై
Andhra Pradesh | వైసీపీ కార్యకర్త రషీద్ దారుణహత్యతో కదిలిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు వినుకొండకు వెళ్లి క్యాడర్ లో జోష్ నింపారు. మీకు నేనున్నానంటూ ధైర్యం చెప్పారు.
వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో వైఎస్ జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలను కలుస్తున్నా, జనంలోకి వచ్చింది మాత్రం వినుకొండ పర్యటనతోనే. 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పరిమితం కావడంతో వైసీపీ పనైపోయిందని టీడీపీ నాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. ఓడిపోయినప్పటికీ 40 శాతం ఓట్లు సాధించామని నాయకులు చెప్పుకుంటున్నప్పటికీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని కార్యకర్తల్లో ఆందోళనయితే ఉంది.
ఈ పరిస్థితుల్లో బాధితుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ తొలిసారి ప్రజల్లోకి వస్తుండటంతో స్పందన ఎలా ఉంటుందా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బులిచ్చి, బస్సులేసి జనాన్ని తరలించారని.., ఇకపై అలాంటి వసతులు ఉండవు కనుక జనం వచ్చే పరిస్థితి ఉండదని టీడీపీ నాయకులు సైతం విమర్శలు చేశారు. అధికార కూటమి విమర్శలకు నిన్నటి జగన్ వినుకొండ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాడేపల్లిలో బయల్దేరింది మొదలు వినుకొండ చేరుకునే వరకు జగన్ కాన్వాయ్‌కు వానలోనే స్వాగతం పలికిన కార్యకర్తలు మీవెంటే ఉన్నామని జగన్‌కు స్పష్టం చేశారు.
తాడేపల్లి నుంచి వినుకొండకు 7 గంటలకు పైగా ప్రయాణం
జగన్ షెడ్యూల్ ప్రకారం అరగంట సేపు పరామర్శకు సమయం కేటాయించారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత తాడేపల్లికి వచ్చేయాలి. కానీ ఉదయం పది గంటలకు జోరున వానలో మొదలైన జగన్ పర్యటన దారిపొడవునా కలుస్తున్న జనాలు, అభిమానులతో చాలా ఆలస్యం అయ్యింది. షెడ్యూల్ ప్రకారం ఒంటి గంటకు బాధితుడి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారని అనుకోగా వినుకొండ చేరేసరికి సాయంత్రం 5 గంటలు దాటిపోయింది. జగన్ రాకను తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా దారిపొడవునా రోడ్డుపై చేరుకుని ఆయన కోసం ఎదురుచూస్తుండటంతో వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ జగన్ ముందుకు సాగాల్సి వచ్చింది. రెండున్నర గంటలు సాగాల్సిన జర్నీ ఏడు గంటలు పట్టిందంటేనే పరిస్థితి అర్థమవుతుంది.
తాడేపల్లిలో బయలుదేరింది మొదలు గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట, సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ లాంటి ప్రధాన సెంటర్లలో ఆగితేనే అంతటైం పట్టింది. కొన్నిచోట్లయితే కారు అద్దం కూడా దించకుండా వెళ్లారు. లేకపోయుంటే వినుకొండ చేరుకునేపాటికి ఏ అర్థరాత్రో అయ్యేదని కార్యకర్తలు సంతోషంగా చెప్పుకుంటున్నారు. దారిపొడవునా బారులుదీరి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తనకోసం నిల్చున్న జనాన్ని చూసి జగన్ సైతం ధైర్యంగా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటా అనేలా కనిపించారు. ఆ తర్వాత మీడియాతోనూ కాన్ఫిడెన్స్‌గా కనిపించారు.
పల్నాడు కేడర్‌లో ఉత్సాహం
2019లో చారిత్రక విజయం తర్వాత వైసీపీలో ఉత్సాహం కనిపించింది. పల్నాడులో టీడీపీకి కంచుకోటల్లాంటి సత్తెనపల్లి, చిలకలూరిపేట, గురజాల, వినుకొండ.. స్థానాలను గెలుచుకుని ఊపుమీదుంది. అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి కంచుకోట లాంటి మాచర్ల సహా అన్ని స్థానాలను కోల్పోయింది. నరసరావుపేట పార్లమెంట్ ను టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. దానికితోడు ఎన్నికల తర్వాత పల్నాడు ప్రాంతంలోనే హింస చెలరేగి 144 సెక్షన్ కూడా విధించాల్సి వచ్చింది. పార్టీకి కీలకనాయకుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైతం జైలుపాలయ్యారు.
ఈ క్రమంలో వినుకొండలో అడుగుపెడుతున్న జగన్‌ను కలిసేందుకు జోరున వర్షంలో ఎవరొస్తారని కేడర్‌లో ఒకరకమైన అనుమానాలున్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ అడుగడుగునా ఆయనకు నీరాజనాలు పట్టేందుకు పార్టీ కేడర్ రోడ్లమీద గంటల తరబడి వేచిచూడటం చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. వినుకొండ పట్టణంలోకి వచ్చిన తర్వాత రషీద్ ఇంటికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టిందంటేనే వచ్చిన జనాన్ని అంచనా వేయొచ్చు. విజువల్స్ చూస్తుంటే ఎన్నికల ర్యాలీని తరలించింది. వీళ్లు బిర్యానీ పొట్లాలు, మందు బాటిళ్లు ఇచ్చి డబ్బులు పంచితే వచ్చిన జనాలు కాదని కార్యకర్తలు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి కొంచెం సంతోషం కలిగించిన వార్త ఏదైనా ఉంది అంటే నిన్నటి జగన్ పర్యటన సక్సెస్ కావడమేనని చెప్పొచ్చు.
ఉద్యమాలకు సిద్ధమని హింట్ ఇచ్చారా..!
రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్ తల్లికి వందనం పథకం గురించి ప్రస్తావించి విమర్శలు చేశారు. దాంతో ఇకపై ఉద్యమాలకు సిద్ధమవుతన్నట్టే అని సంకేతాలిచ్చారు. ముఖ్యంగా హత్యారాజకీయాలు, పథకాల అమలు గురించి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నట్టు ఎంపీలతో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను బట్టి అర్థం అవుతుంది. పార్టీ భవిష్యత్తుపై కమ్ముకున్న నీలినీడలు కొంచెంకొంచెంగా కనుమరుగయ్యేదానికి నిన్నటి పరామర్శ యాత్ర జగన్‌కు ఒకదారి చూపించినట్లు అయింది.