Amaravati YSRCP Reactions : తీర్పుపై వ్యాఖ్యలు - రూ. లక్ష కోట్ల వాదనలు ! అమరావతి తీర్పుపై వైఎస్ఆర్‌సీపీ భిన్న వాదనలు
అమరావతి తీర్పుపై వైఎస్ఆర్‌సీపీ నేతల భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఆర్థిక భారం మోయలేమని సజ్జల అనగా.. అవగాహన లేని తీర్పు అని హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు.
అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైఎస్ఆర్‌సీపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. హోంమంత్రి సుచరిత హైకోర్టుకు అవగాహన లేదన్నట్లుగా మాట్లాడారు. మరో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. మరో వైపు ప్రభుత్వ ముఖ్య సలహాదాలు సజ్జల రామకృష్ణారెడ్డి న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని .. కానీ రాజధాని కోసం రూ. లక్ష కోట్లను ఖర్చు పెట్టలేమన్నారు.
రూ. లక్ష కోట్ల భారాన్ని మోయలేం : సజ్జల
చంద్రబాబు అమరావతి పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారని .. రాజధాని పేరుతో లక్ష కోట్ల భారాన్ని ఏ రాష్టమూ మోయలేదన్నారు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నాం .. ప్రజాభిప్రాయస ప్రకారమే సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ డ్రామాలాడుతుందని విమర్శించారు. మాది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు. రాష్ట్రం మొత్తం మాకు సమానమే. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. న్యాయవ్యవస్థను మేం గౌరవిస్తామన్నారు. ప్రజలు ఎన్నిసార్లు ఓటుతో బుద్ధి చెప్పినా టీడీపీ మారడం లేదని విమర్శించారు.
అవగాహన లేని తీర్పు : హోం మంత్రి మేకతోటి సుచరిత
రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని కోర్టు చెప్పిందని ... రాజధానిపై శాసన నిర్ణయాధికారం లేదని చెప్పే వారికి అవగాహన లేదని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యానించారు. అమరావతి ప్రాంతం శాసన రాజధానిగా ఉంటుందని, తాము అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని మేకతోటి సుచరిత వెల్లడించారు. అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వం విధానమని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అమరావతిలోనే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు.
చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు : ఎమ్మెల్యే కోరుముట్ల
రాజధాని గా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైఎస్ఆర్‌సీపీ ఎణ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.న్యాయ వ్యవస్థ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని అన్నారు. రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకు లేదని చెప్పారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. అసెంబ్లీని న్యాయ వ్యవస్థ శాసించడం దారుణమని... ఇలాంటి నిర్ణయాలు తిరిగి న్యాయ వ్యవస్థనే కాటేస్తాయని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని కోరుముట్ల విమర్శించారు.