మహిళలతో కలిసి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి స్టెప్పులు!
మహిళలతో కలిసి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి డ్యాన్స్ చేశారు. ఆయన వేసిన స్టెప్పులు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
చిత్తూరు జిల్లా ఎస్.ఆర్ పురం మండలంలో జగనన్న పథకాలపై ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల మహిళలు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో జగనన్న.. జగనన్నా పాటకు స్టెప్పులేశారు. వీరితోపాటు డిప్యూటీ సీఎం కూడా డ్యాన్స్ చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
మంత్రి నారాయణ స్వామి ఏం చేసినా అదో సంచలనమే. ప్రతిపక్షాన్ని బూతులు తిట్టినా... అదే టైంలో ప్రత్యర్థులను తిట్టబోయి తమ పార్టీ నేతలను తిడుతూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మధ్య కాలంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. తర్వాత తన కామెంట్స్‌ను వక్రీకరించారని మీడియాను తప్పుపట్టారు.
గడపగడపకూ ప్రభుత్వానికి వెళ్లని వారిపై..
అయితే వచ్చే ఎన్నికల్లోల 175కి 175 స్థానాలు సాధించే దిశగా వైసీపీ అధినేత, సీఎం జగన్.. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. మే 11వ తేదీన కార్యక్రమం మొదలు పట్టగా ఏడుగురు ఎ్మెల్యేలు అసలు ఒక్కరోజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దీంతో సీఎం జగన్ తాడేపల్లి గూడంలోని క్యాంపు కార్యాలయంలో వర్క్ షాపు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతీ ఒక్క ఎమ్మెల్యే గడగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
65 మంది పది రోజుల్లోపే...
అయితే దాదాపు 65 మంది 10 రోజుల్లోపే తిరిగారు. 20 రోజులకు పైబడి తిరిగిన ఎమ్మెల్యేలు సింగల్ డిజిట్‌లో ఉండటం ఏంటని, ఇలాగైతే మీ పనితీరు మెరుగు పడలేదా అంటూ సీఎం ప్రశ్నించారు. గడపగడపకు కార్యక్రమంలో కుటుంబ సభ్యులను తిప్పితో దాన్ని లెక్కలోకి తీసుకోం అని, మీరు నెలలో కనీసం 20 రోజులపాటు తిరగాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
2024 ఎన్నికల్లో కొడితే, ఇక మనకు ప్రతిపక్షం ఉండదు, మరో 30 ఏళ్లు ఉంటాం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడైన రుషిరాజ్ సింగ్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేస్తుంటే... కొందరు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇంకొందరు ఇంటింటికీ వెళ్తున్నారు. ఇలా కాకుండా ఇంటింటికీ అందరూ వెళ్లాలని చెబుతూ కార్యక్రమ మార్గదర్శకాలను వివరించినట్లు తెలిసింది.
గడప గడపకూ కార్యక్రమంలో ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు తిరిగారనే వివరాలను ప్రభుత్వ ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించినట్లు తెలిసింది. ఏలూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, కావలి, కోవూరు, మైలవరం, శ్రీశైలం ఎమ్మెల్యేలు అసలు తిరగలేదని తెలిపినట్లు సమాచారం, పీఫ్ విప్ ప్రసాద రాజు 21 రోజుల, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ 20 రోజులు ఇలా అతి కొద్ది మంది 15-20 రోజుల పాటు తిరిగినట్లు వివరించారని సమాచారం. సీఎం జగన్ పిలుపు మేరకే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గడగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టెప్పులు వేశారు.