Andhra Politics: నేరాల్లో బాధితులకు ప్రజాధనం పరిహారంగా ఇవ్వొచ్చా? సీఎం చంద్రబాబు ఎందుకిలా చేస్తున్నారు?
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కారణాలతో హత్యలకు గురైన వారికి ఉద్యోగాలు, స్థలాలు, పొలాలు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ఒత్తిడికి లొంగిపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Andhra Government compensation for victims of crimes: ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం. ప్రభుత్వాన్ని నడిపేవారు ప్రభుత్వానికి ఓనర్లు కాదు. వారు తమ బాధ్యతలను చట్టప్రకారం నిర్వహించాల్సిందే. అయితే ఇటీవలి ఏపీలో రాజకీయాలు మారిపోతున్నాయి. రాజకీయ కారణాలతో ఇతరులకు సాయం చేయడానికి ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది వివాదాస్పదం అవుతోంది. ఏదైనా రాజకీయ గొడవల బాధితులకు పరిహారాలు ఇవ్వడం అనే సంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. రాజకీయ కారణాలతో ఒత్తిళ్లతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు కారణం అవుతోందది.
తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
వైఎస్ఆర్‌సీపీ హయాంలో మాచర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త హత్య జరిగింది. అప్పట్లో ఈ హత్య సంచలనం సృష్టించింది. చంద్రబాబునాయుడు స్వయంగా వెళ్లి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చంద్రయ్య కుమారుడికి ఏదైనా సాయం చేయాలనుకున్నారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం సాధ్యం కాదు కాబట్టి అసెంబ్లీలో ఆమోదించారు. శాసనమండలిలో వైసీపీకి మెజార్టీ ఉంది కాబట్టి ఆ నిర్ణయం పెండింగ్ లో పడిపోయింది. ఇంకో సారి మండలికి పంపితే.. ఆమోదం లేకపోయినా ఉద్యోగం వస్తుంది.ప్రభుత్వ సర్వీసులో ఉండి.. ప్రజల కోసం పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబాలకే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే సంప్రదాయం ఈ నియామకంతో మారిపోతుంది. రేపు మరో పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటే ఇక ప్రభుత్వ ఉద్యోగాలు తమ పార్టీ నేతలకు.. అవసరమైన వారికి ఇచ్చుకునే సంప్రదాయం పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన ఉంది.
కందుకూరు ఘటనలో బాధితులకు పొలం, పరిహారం
కందకూరు లక్ష్మినాయుడు అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అన్న అభిప్రాయం ఉంది. కానీ అది కులం కోణం తీసుకుంది. చనిపోయిన వ్యక్తి, చంపిన వ్యక్తి వేర్వేరు కులాలు. ఆ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలన్న రాజకీయం ప్రారంభం కావడంతో చంద్రబాబు ఒత్తిడికి గురయ్యారు. ఆ కుటుంబానికి శరవేగంగా న్యాయం చేసేందుకు హోంమంత్రిని కూడా కందుకూరు పంపారు. నెల్లూరు మంత్రి నారాయణ, హోంమంత్రి పరామర్శించారు. వారి సూచనల మేరకు లక్ష్మినాయుడు భార్య ఇద్దరు పిల్లలకు తలా రెండు ఎకరాల చొప్పున ఆరెకరాలు, దాడిలో గాయపడిన లక్ష్మినాయుడు సోదరుడికి ఐదు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ఈ జాబితాలో ఉంది.
కొట్టుకు చస్తే ప్రజాధనం ఇస్తారా అన్న విమర్శలు
నేరాల్లో చనిపోయిన వారి కుటుంబానికి ఎకరాలకు ఎకరాలు.. లక్షలకు లక్షలు ఇవ్వాల్సిన పని లేదని.. వారికి న్యాయం చేయడం అంటే.. నిందితులకు శిక్ష పడేలా చేస్తే సరిపోతుందని అభిప్రాయం వినిపిస్తోంది. కందుకూరు పోలీసులు హంతకుడి కుటుంబ ఆస్తిని జప్తు చేసి బాధితులకు ఇచ్చేందుకు కోర్టుకు వివరాలు సమర్పించారు కానీ ప్రజాధనం ఎందుకివ్వాలన్న ప్రశ్న వస్తోంది. ఏడాదికి 9వేల హత్యలు జరుగుతాయని..అందరికీ పరిహారం ఇస్తారా అని మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు.
అన్ని హత్యలకూ రాజకీయ రంగు పులిమితే ?
ఇప్పుడు హత్యల్ని హత్యల్లా చూడకుండా నష్టపరిహారం ప్రతి హత్యకూ కులం రంగు పులిమే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రజాధనం సాయంగా చేసిన రెండు సందర్భాల్లోనూ విమర్శలకు కారణం అవుతున్నాయి. పాలకులు మరింత జాగ్రత్తగా ప్రజాధనం, ఆస్తుల విషయంలో ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా నష్టం జరుగుతుందన్న ఒత్తిడికి లోనై సీఎం చంద్రబాబు ఇలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.





















