Cruise Terminal At Visakhapatnam: విశాఖ సిగలో మరో మణిహారం, రూ.96 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్ నిర్మాణం
Cruise Terminal At Visakhapatnam: విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరనుంది. సముద్ర విహారంపై ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది.
Cruise Terminal At Visakhapatnam: విశాఖ సిటీ సిగలో మరో ప్రతిష్టాత్మక పర్యాటక మణిహారం చేరనుంది. సముద్ర విహారంపై ఆసక్తి చూపే పర్యాటకుల కోసం విశాఖ పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ ముస్తాబైంది. వివిధ దేశాల పర్యాటకులు క్రూయిజ్‌లో వచ్చి విశాఖ నగరంలో పర్యటించేలా ఈ టెర్మినల్‌లో వివిధ ఏర్పాట్లు చేశారు. పోర్టులోని గ్రీన్ చానల్ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో ఈ సముద్ర విహార కేంద్రాన్ని నిర్మించారు. ఇందుకోసం కేంద్ర టూరిజం శాఖ 38.50 కోట్ల రూపాయలు కేటాయించింది. క్రూయిజ్ షిప్స్‌తోపాటు భారీ కార్గో నౌకల హ్యాండ్లింగ్‌కు అనుగుణంగా క్రూయిజ్ టెర్మినల్‌ను తీర్చిదిద్దారు. సోమవారం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభించనున్నారు.
ఏపీ పర్యాటక రంగానికి ఊతం
భారత్‌లో క్రూయిజ్ టూరిజానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ టెర్మినల్ నిర్వహణలో ఏపీ టూరిజం, కేంద్ర టూరిజం శాఖలతో కలిసి విశాఖపట్నం పోర్టు పని చేయనుంది. ప్రస్తుతం 7.1 యూఎస్ బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. రానున్న పదేళ్లలో 12.1 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా క్రూయిజ్ రంగం 1.17 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పర్యాటక రంగం వృద్ధి చెందటంతో పాటు ఉద్యోగ కల్పన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్‌లో బీచ్‌లు, కొండలు, గుహలు, వైల్డ్ లైఫ్, అడవులు, ఆలయాలు వంటి విభిన్న రకాల పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. దేశీయ పర్యాటక ప్రదేశాలలో ఆంధ్రప్రదేశ్ 14 శాతం పర్యాటకులను అకట్టుకుంటూ దేశంలో మూడో ప్లేస్‌లో ఉంది. అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. క్రూయిజ్ సేవలు ప్రారంభమైతే రాష్ట్రంలో ఇంటర్నేషనల్ టూరిజం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
విశాఖ క్రూయిజ్ టెర్మినల్ ప్రత్యేకతలు
2000 మంది ప్యాసింజర్లను తీసుకువెళ్లే సామర్థ్యం కలిగిన వెసెల్స్‌ను నిర్వహించే సామర్థ్యం ఈ టెర్మినల్ సొంతం. టెర్మినల్ పార్కింగ్ ప్రాంతంలో 7 బస్సులు, 70 కార్లు, 40 బైక్‌లు నిలిపేలా ఏర్పాట్లు చేశారు. 2,500 చదరపు మీటర్లలో టెర్మినల్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, విదేశీ కరెన్సీ మార్పిడి కౌంటర్‌లు, గ్యాంగ్ వే, రెస్టారెంట్, స్పెషల్ లాంజ్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, టూరిజం ఆపరేటర్స్ కౌంటర్లు ఏర్పాటు చేసే విధంగా నిర్మాణాలు పూర్తిచేశారు.
క్రూయిజ్‌లో వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల చెకింగ్ కోసం ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ క్యాబిన్స్, పర్యాటకులు సేదతీరేందుకు టూరిస్ట్ లాంజ్ నిర్మించారు. గంటకు 200 కి.మీ. వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా షోర్ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తున్నారు. రెగ్యులర్ బెర్త్ 180 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ టెర్మినల్‌లో 330 మీటర్ల భారీ పొడవైన క్రూయిజ్ బెర్త్ నిర్మించారు. 15 మీటర్ల వెడల్పు, 9.50 మీటర్ల డ్రెడ్జ్ డెప్త్‌ని నిర్మించారు. తద్వారా క్రూయిజ్ రాని సమయంలో సరుకు రవాణా చేసే భారీ కార్గో నౌకలను కూడా ఈ బెర్త్‌లోకి అనుమతించేలా డిజైన్ చేశారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కేంద్ర ఓడరేవులు, జల రవాణా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్, సహాయ మంత్రి శ్రీపాద నాయక్ విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులు, పలువురు మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రూ.333.56 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు.