MLC Ananthababu case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం - తదుపరి విచారణకు కోర్టు అనుమతి
Subramaniam Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన కేసులో తదుపరి విచారణకు కోర్టు అనుమతించింది. హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అంగీకరించారు.

Driver Subramaniam Murder Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తదుపరి దర్యాప్తుకు అనుమతి ఇస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో తీర్పు వెలువడింది. 2022లో కాకినాడలో దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సుబ్రహ్మణ్యం శవాన్ని అతని ఇంటి వద్ద “డోర్ డెలివరీ” చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసు విచారణ లోపభూయిష్టంగా జరిగిందని, నిందితుడు అనంత బాబుకు అనుకూలంగా పోలీసు విచారణ నడిచిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసు పునర్విచారణ కోసం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
పునర్విచారణకు కోర్టు అనుమతితో కీలక పరిణామాలు
విచారణ జరిపిన రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ కేసు పునర్విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ద్వారా తదుపరి విచారణ కొనసాగించేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ 22, 2025న కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఈ కేసును పునర్విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ఐపీఎస్ అధికారి, కాకినాడ సబ్ డివిజనల్ పోలీసు అధికారి మనీష్ దేవరాజ్ పాటిల్‌ను నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు, అనంత బాబుపై తదుపరి విచారణ కొనసాగనుంది. ఈ విచారణలో గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విచారణలోని లోపాలను సరిదిద్ది, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత బాధిత కుటుంబానికి పరిహారం, న్యాయసాయం
ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కుటుంబానికి పరిహారం అందించింది. న్యాయ సాయం అందించేందుకు న్యాయవాదిని కూడా కేటాయించింది. మరో వైపు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అనంత బాబుకు రాచమర్యాదలు జరిగాయని బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అదే సమయంలో దర్యాప్తు పూర్తిగా జరగకుండా.. పోలీసుల్ని నియంత్రించారని.. చార్జిషీటు దాఖలు చేయకుండా.. బెయిల్ వచ్చేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు
అనంతబాబు ను సస్పెండ్ చేసినట్లుగా ప్రకటించినప్పటికీ ఆయన వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థుల కోసం విస్తృతంగా శ్రమించారు. ఈ కేసులో అనంతబాబు ఒక్కరే కాదని ఇంకా పలువురు ఉన్నారని.. వారెవరో బయటకు రాకుండా ఉండేందుకే తదుపరి దర్యాప్తు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దర్యాప్తు చేయడం వల్ల .. ఆ హత్య కేసులో అసలు కారణాలేమిటో వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.





















