AP ACB App : దిశ తరహాలో ఏసీబీ యాప్ - అవినీతి అంతానికి సీఎం జగన్ కొత్త ఆలోచన!
ఏసీబీ కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకు రావాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రజలు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి అంతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచన చేశారు. దిశ తరహాలో అవినీతి ఫిర్యాదులకుగానూ ఏసీబీ యాప్ తేవాలని ఆయన అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులను ఆదేశించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో హోం శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏసీబీకి యాప్ ద్వారా ఆడియో ఫిర్యాదు సైతం చేయొచ్చని పేర్కొన్నారు. అవినీతి చోటు చేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందేని ఆయన అధికారులను ఆదేశించారు. నెలరోజుల్లోగా ఏసీబీ యాప్ రూపకల్పన జరగనుందని, నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు ఉంటాయని ప్రకటించారు.
సెల్‌ఫోన్ పోయిందా ఇలా ఫిర్యాదు చేయండి- శుభవార్త చెప్పిన అనంతపురం పోలీసులు
అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. డ్రగ్స్ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదని తెలిపారు. మూలాల్లోకి వెళ్లి కూకటివేళ్లతో పెకిలించేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం.. విద్యాసంస్థలపైనా ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. చీకటి ప్రపంచంలో వ్యవహారాలను నిర్మూలించాలని తెలిపారు. ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ ఉంటుందన్నారు.
చందాలు వసూలు చేసి మరీ భూతవైద్యం- శ్రీకాకుళం జిల్లాలోని ఓ పల్లెలో లాక్‌డౌన్
దిశ యాప్ ద్వారా ఇప్పటికే ఏపీలో మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఏసీబీ యాప్‌ను ప్రజలందరూ ఉపయోగించుకుంటే ప్రభుత్వ శాఖల్లో అవినీతిని చాలా వరకూ నియంత్రించవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందన వంటి కార్యక్రమాలను నిర్వహించింది. మొదట్లో మంచి స్పందన వచ్చినప్పటికీ తర్వాత వివిధ కారణాల వల్ల వాటికి ఆదరణ తగ్గింది. ఇప్పుడు ఏసీబీ యాప్ రెడీ అయితే... అందరూ యాప్ ద్వారానే ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. యాప్‌లో ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మందిధైర్యంగా ఫిర్యాదుచేస్తారని భావిస్తున్నారు.
దిశ యాప్ తరహాలోనే ఏసీబీ యాప్‌ను కూడా పటిష్టంగా తయారు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో నెల రోజుల్లో ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా యాప్‌పై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు.