Gudivada Amar News: మంత్రి గుడివాడకు గాజువాకే ఎందుకు? జగన్ వ్యూహం ఏంటి?
AP Latest News: ఎట్టకేలకు సీఎం జగన్.. గుడివాడ అమర్ నాథ్ ను గాజువాక నియోజకవర్గ ఇంఛార్జిగా నియమించారు.

Gudivada Amarnath: ఏపీలో ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్ నాథ్ కు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. ఆయన్ను ఎట్టకేలకు గాజువాక నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారు. కొన్నాళ్లుగా గుడివాడ అమర్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉన్న సంగతి తెలిసిందే. తన అనకాపల్లి సీటు మరొకరికి కేటాయించి.. గుడివాడను పక్కకు పెట్టేశారనే చాలా మంది అన్నారు. దీంతో గుడివాడ తన తలరాతను జగన్ మోహన్ రెడ్డే రాస్తారంటూ బహిరంగంగా వారికి సమాధానం ఇచ్చారు. అటు విపక్ష నేతలు కూడా ఇక గుడివాడకు రాజకీయ భవిష్యత్తు లేదని ఎద్దేవా చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సీఎం జగన్ అమర్ నాథ్ కు గాజువాక నియోజకవర్గం కేటాయించడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.
ప్రస్తుతం అనకాపల్లి నుంచి గుడివాడ అమర్ నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ ఇంఛార్జిల ప్రక్షాళనలో భాగంగా ఆ స్థానాన్ని భరత్ కుమార్ కు కేటాయించడంతో.. గుడివాడ అమర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. అటు అధిష్ఠానం నుంచి కూడా చాలా రోజులుగా స్పష్టత లేకపోవడంతో గుడివాడ అమర్ రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ఇటీవల అనకాపల్లి సభలో సీఎం జగన్ పాల్గొన్న సందర్భంగా గుడివాడ అమర్నాథ్ తనకున్న ఇబ్బందులను సీఎం ముందే వెల్లడిస్తూ... వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటూ చాలామంది తనను ప్రశ్నిస్తున్నారని గుడివాడ అమర్ ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో అదే సభలో గుడివాడ అమర్ కు సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. భరత్, అమర్ ఇద్దరు తన తమ్ముళ్ళే అని.. వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ ని తన గుండెల్లో పెట్టుకుంటానని సీఎం భరోసా ఇచ్చారు. తాజాగా అమర్ ను గాజువాక ఇంఛార్జిగా నియమించారు.
2014 నుంచి అనకాపల్లిలోనే
నిజానికి గుడివాడ అమర్ నాథ్ విశాఖపట్నంలోని గాజువాకకు చెందినవారు. కానీ, 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అదే అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2006లో గుడివాడ అమర్ నాథ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. అలా తన 21 ఏళ్ల వయసులోనే జీవీఎంసీ కార్పొరేటర్ గా గెలిచారు. అతి చిన్న వయసులోనే విశాఖ జిల్లా ప్రణాళిక సంఘం మెంబర్ గా కూడా పని చేశారు. ఇక 2011లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి.. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గా పని చేశారు.
అనకాపల్లి నియోజకవర్గం గుడివాడకు పక్కా నాన్ లోకల్ అని ప్రచారం సాగుతున్న వేళ తాజాగా సీఎం జగన్.. గుడివాడ అమర్ ను తన సొంత ప్రాంతం గాజువాకకు ఇంఛార్జిగా నియమించారు. మరోవైపు, గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి.. ప్రస్తుత ఇంఛార్జి ఉరుకూటి రామచంద్రరావుకు విభేదాలు ఉన్నాయి. 2019 తర్వాతి నుంచి ఎమ్మెల్యే కుమారుడు దేవన్ రెడ్డి గాజువాక ఇంఛార్జిగా కొనసాగుతుండగా.. గత డిసెంబరులో ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉరుకూటి రామచంద్రరావును నియమించారు. అయినా ఎమ్మెల్యేకు, ఉరుకూటికి విభేదాలు కొనసాగుతుండడం స్థానికంగా పార్టీకి నష్టం కలిగిస్తుందనే అభిప్రాయంతోనే గుడివాడ అమర్ ను ఇంఛార్జిగా నియమించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

