Free bus: ఉచిత బస్సు పథకంపై చంద్రబాబు కీలక అప్ డేట్ - ముహుర్తం ఫిక్స్
Andhra Free Bus: ఆగస్టు పదిహేనో తేదీన ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో ఈ ప్రకటన చేశారు.

Free bus From Aug 15: ఉచిత బస్సు పథకాన్ని ఏపీలో ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సి క్యాంప్ రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సిఎం పాల్గొని రైతులు, పారిశుధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో ఉద్యానవనం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అక్కడ ప్రసగించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకంపై స్పందించారు. ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అమలు చేస్తామన్నారు.
ఎన్నికల హామీల్లో కీలకమైనది ఉచిత బస్సు
ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ఇచ్చిన వాటిలో ఉచిత బస్సు హామీ కీలకమైనది. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం జూన్ లో అమ్మకు వందనం , అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఆగస్టు పదిహేను నుంచి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉచిత బస్సును ప్రారంభిస్తారు. ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
కొత్త బస్సులు కొనుగోలు చేసి పథకం అమలు
తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తోంది. కర్ణాటకలో.. ఢిల్లీలోనూ అమల్లో ఉంది. అన్నిచోట్లా పథకం అమలును ఏపీ అధికారులు పరిశీలించారు. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజునే.. ఉచిత బస్సును అమలు చేస్తున్నారు. అయితే హడావుడిగా ప్రకటించడం వల్ల నిర్వహణ పరమైన సమస్యలు వచ్చాయి. సరైన బస్సులు లేకపోవడం కూడా సమస్యగా మారింది. ఇలాంటి సమస్యలన్నింటినీ అధ్యయనం చేసిన ప్రభుత్వం వెయ్యి కొత్త బస్సుల్ని కొనుగోలు చేసి..కొత్త సిబ్బందిని నియమించుకుని పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. అందుకే ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది.
పేద, మధ్యతరగతి వర్గాల ఎదురు చూపులు
పథకం ప్రారంభించిన మొదట్లో మహిళలు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే అవసరమైన వారు మాత్రమే ప్రయాణించేలా చూడాలన్న సూచనలు కూడా ఉన్నాయి. ఈ పథకం అమలు అయితే.. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు.. కూలీలకు ఎంతో కొంత ఆదాయ మిగులు ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే పేద, మధ్యతరగతి ఆదాయవర్గాలు ఈ పథకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పించన్లను పెంచింది. అలాగే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. పలు రకాల పథకాలను పునంప్రారంభించింది.





















