Chandrababu : దసరా రోజున టీడీపీ మేనిఫెస్టో - మహిళలకే ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు ప్రకటన !
దసరా రోజున టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కార్యాలయంలో మహాశక్తి - రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Chandrababu : తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను మహిళల సమక్షంలో విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. టీడీపీమహిళా నేతలు వంగలపూడి అనిత, పీతల సుజాత తదితరులు చంద్రబాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. మేనిఫెస్టోలోనూ మహిళాభ్యున్నతికే పెద్ద ఎత్తున పథకాలు పెడతామని తెలిపారు.
ఆడబిడ్డలకు అండగా ఉంటామన్న చంద్రబాబు
ఆడబిడ్డ పేరతో పెళ్లి కానుక ఇచ్చింది తెలుగుదేశం పార్టీనేనని చంద్రబాబు గుర్తు చేశారు. ఆనాడు ఆడబిడ్డలు కష్టపడకూడదనే దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చామన్నారు. ఆడబిడ్డల భవిష్యత్‌కు మహాశక్తి పథకం తోడ్పుతుందన్నారు. మహిళలను ఆర్థికంగా స్థిరపరిచేందుకు టీడీపీ అన్ని వేళలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. మహిళలను శక్తిమంతులుగా తయారు చేయడమే టీడీపీ లక్ష్యం. NTR ఆత్మగౌరవం ఇస్తే నేను ఆత్మవిశ్వాసం ఇచ్చాను. టీడీపీ గెలుస్తుందని సంకల్పం చేసుకుని ప్రయత్నించండి. మీ భవిష్యత్ గారంటీ నాది. భవిష్యత్‌లో టీడీపీ కరెంట్ చార్జీలు పెంచదని స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో హామీల అమలు
టీడీపీ అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరుతో పిల్లలందరి చదువుకు ఆర్థిక చేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏటా రూ.15వేలు ఇస్తామని చంద్రబాబు తెలిపారు. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం ప్రకటించామన్నారు. పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని.. అవసరమైతే మరో సిలిండర్ కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పీ-4 పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తాం. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అన్నీ చేయవచ్చన్నారు. ప్రస్తుత విధానాల వల్ల ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడని.. పేదవాడు మరింత పేదవానిగా మిగిలిపోతున్నారని అన్నారు. పేదవారికి అండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
టీడీపీ నేతలపై దాడిని ఖండించిన చంద్రబాబు
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా, మారుణాయుధాలతో జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా నేతలను అడిగి సమాచారం తెలుసుకున్నారు. దాడుల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. గ్రామంలో వైసీపీ గూండాలు ఇళ్లపై పడి గంటల తరబడి మారణహోమం సృష్టిస్తుంటే నివారించలేక పోవడం పోలీసుల వైఫల్యం కాదా అని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లో హింసా రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకు పోలీసుల మద్దతే ఈ తరహా ఘటనలకు కారణం అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.