Viveka Murder Case: వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తి చేసిన సీబీఐ, నెక్ట్స్ ఏంటీ ?
మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తిచేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీం తదుపరి ఆదేశాలతో దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది.

YS Viveka murder case | న్యూఢిల్లీ: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. సుప్రీంకోర్టు కనుక ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సీబీఐ తెలిపింది. జస్టిస్ ఎంఎం సందేరేష్ బెంచ్ మాజీ ఎంపీ వివేకా హత్య కేసుపై మరోసారి విచారణ చేపట్టి.. సీబీకి తదుపరి ఆదేశాలు ఇవ్వనుంది. ఈ కేసులో పలువురు నిందితులు ఇదివరకే చనిపోగా, చాలా వరకు అప్రూవర్లుగా మారారని తెలిసిందే.
వివేకా హత్య కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కరరెడ్డిల బెయిళ్లు రద్దు చేయాలని, కుట్రదారును తేల్చేలా దర్యాప్తును కొనసాగించాలని మాజీ ఎంపీ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. మరోవైపు ఉదయ్‌కుమార్‌రెడ్డి, సునీల్ యాదవ్, భాస్కరరెడ్డి బెయిళ్లను రద్దు చేయాలని సీబీఐ సైతం పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల వరకు దాఖలైన మొత్తం 11 పిటిషన్లపై జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ జస్టిస్ ఎంఎం సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. సీబీఐ అందించే సమాచారం, సూచనలతో సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేస్తామనిని జస్టిస్ సుందరేష్ అన్నారు.
2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ఎంపీగా, మంత్రిగా సేవలు అందించారు వివేకానందరెడ్డి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య రాష్ట్రంలో రాజకీయంగా కలకలం రేపింది. 2019 మార్చి 15 న వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. మొదట వివేకా గుండెపోటుతో చనిపోయారని వార్తలు బయటకు వచ్చాయి. కొన్ని గంటల తరువాత ఆయన మృతదేహంపై గాయాలున్నాయని, తలపై సైతం తీవ్రమైన గాయాలున్నాయని ఇది హత్య అని ఆరోపణలు వచ్చాయి. మాజీ సీఎం జగన్ మామ గంగిరెడ్డి మీద పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాదాపు ఆరేళ్ల నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సోదరుడు వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో వివేకా కూతురు సునీతారెడ్డి సైతం పలుమార్లు న్యాయం కోసం పోరాడినా ఫలితం లేకపోయింది. ప్రతిపక్షనేతగా బాబాయ్ వివేకా హత్యను వాడుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం తన తండ్రి హత్య కేసు హంతకులను పట్టుకోలేదని విమర్శించారు.






















