Vijayawada Temple: దసరాకి విజయవాడ దుర్గగుడి టిక్కెట్టు 1000 రూపాయలా? అంతకు పెంచేశారా!
Vijayawada Durga Temple | దసరా వేడుకల సందర్భంగా విజయవాడలో దుర్గగుడి టిక్కెట్టు 1000 రూపాయలు చేశారని ఓ నోటీసు వైరల్ అవుతోంది. భక్తులు ఈ ప్రకటన నిజమేనా అని చెక్ చేస్తున్నారు.

విజయవాడ: సోషల్ మీడియా యుగంలో ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోయాయి. మన ఫోన్లోకి వచ్చే సమాచారంలో ఏది నిజమో ఏది అబద్దమో కూడా పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. చివరికి దేవుణ్ణి కూడా వదలకుండా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు కొందరు. తాజాగా విజయవాడ దుర్గ గుడిలో దసరా పండుగ సందర్భంగా అమ్మవారి దర్శనం టికెట్ రేటును 1000 రూపాయల కు పెంచారాంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. దీనిపై స్పందించిన దుర్గ గుడి అధికారులు ఆ వార్తలో నిజం లేదని భక్తులెవరూ దానిని నమ్మొద్దు అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.
సామాన్య భక్తులకే మా తొలి ప్రాధాన్యం - దుర్గ గుడి ఈవో
దుర్గగుడిలో దసరా మహోత్సవాల నిర్వహణ గురించి ఇటీవల విజయవాడలో ఆలయ ఈవో అధ్యక్షతన పాలక మండలి సభ్యులతో కీలక సమావేశం జరిగింది. గత ఏడాది దసరా మహోత్సవాల నిర్వహణలో కొన్ని లోటుపాట్లు తలెత్తాయన్న విమర్శ ఉందని ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆ సమావేశంలో చర్చ జరిగింది. అయితే ఆ సమావేశంలోనే దుర్గగుడి దర్శనం రేటు 1000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారంటూ కొన్ని అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయని అవన్నీ పుకార్లే అని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఆలయ నిర్వహణ దసరా ఉత్సవాల కార్యక్రమాల విషయం లో ఎలాంటి తీసుకున్నా అది ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే తీసుకుంటాం తప్ప ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోమని భక్తులు గమనించాలని ఆలయ ఈవో అన్నారు.
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు
సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుపుతున్నట్టు ఈవో శీనా నాయక్ తెలిపారు. ఈ ఏడాది11 రోజుల పాటు విశేషం గా దసరా మహోత్సవాలు జరుగుతాయని తెలిపిన అధికారులు ప్రతి రోజు సాయంత్రం విజయవాడ నగరోత్సవాలు కూడా జరుగుతాయని చెప్పారు.
దసరా పండుగ రోజుల్లో అమ్మవారి అలంకరణలు ఈ విధంగా ఉండనున్నట్టు ఆలయ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
సెప్టెంబర్ 22వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం
23వ తేదీ శ్రీ గాయత్రి దేవి అలకారం
24వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం
25 వ తేదీ శ్రీ కాత్యాయిని దేవి అలంకారం
26 వ తేదీ శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకారం
27 వ తేదీ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం
28 వ తేదీ శ్రీమహా చండీ దేవి అలంకారం
29 తేదీ శ్రీ మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకారం
30 వ తేదీ శ్రీ దుర్గా దేవి అలంకారం
1వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం
2 వ తేదీ విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం
11 రోజులు 11 దివ్య అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు





















